Perni Nani: చంద్రబాబు వద్ద కూలీగా పవన్ కల్యాణ్, కిరాయికి ఒప్పుకున్నారు - పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేసే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, తీరు పట్ల మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విమర్శలు చేశారు. కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆటాడిస్తానని పవన్ కల్యాణ్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంతో అంత సాన్నిహిత్యం ఉండి, సీఎం జగన్‌ను ఆటాడించే సత్తా ఉన్నవారైతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రంతో ఎందుకు మాట్లాడబోరని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమా గ్లామర్ పేరుతో ప్రజలను అమ్మేస్తున్నారని అన్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కల్యాణ్ ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. జనం నవ్వుకుంటున్నప్పటికీ సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
‘‘సీఎం జగన్ గురించి చెప్పడానికి ప్రధాని మోదీ, అమిత్ షా దగ్గరికి వెళ్తావు. ప్రధాని మోదీని కూడా ఓ రోజు కలిసి స్టీల్ ప్లాంట్, ప్రత్యేకహోదా గురించి ఎందుకు మాట్లాడవు? ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు అమ్మేయడానికే నీ డ్రామాలు’’ అని పేర్ని నాని ఆరోపణలు చేశారు.
కూలీ పని చేయడమే పవన్ కు తెలుసు-పేర్ని నాని
పవన్ కళ్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేసే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. అయినా కిరాయికి ఒప్పుకున్నారని, అందుకు తగ్గట్లు కూలీగా పని చేయడమే పవన్ కల్యాణ్ కు తెలుసని అన్నారు. అందులో భాగంగా పవన్ కల్యాణ్ కావాలని ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. అంతేకానీ, ఆయన ఏనాడు వాస్తవాలు మాట్లాడడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకు అసలు అర్ధం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కల్యాణ్ కు విపరీతమైన ద్వేషం, కక్ష ఉందని అన్నారు. చంద్రబాబు కోసమే పని చేస్తానని ఓపెన్ గా చెప్పొచ్చు కదా అని అన్నారు. ముఖ్యమంత్రి అవుతానని అంటున్న పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో చెప్పాలని, ప్రజలకు నిజాయతీతో నిజాలు చెప్పాలని అన్నారు. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘తెలంగాణ సీఎం 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసింది నువ్వు, మీ అన్నయ్య కాదా? మీ షూటింగ్‌లు తెలంగాణలో ఎందుకు ఆపారు? మీ సినిమాల రిలీజ్ లు ఎందుకు ఆపారు? పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో చాలా ఆస్తులు కూడగట్టుకుంటున్నాడు కదా? ఆవుతో, ఎద్దుతో, మామిడి చెట్టుతో పుస్తకం చదువుతూ దాన్ని తలకిందులుగా పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తారు కదా. పవన్‌కు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేదు’’ అని పేర్ని నాని అన్నారు.