Kodali Nani: భీమ్లా నాయక్ వెనక పవన్ కల్యాణ్ ప్లాన్, అంతా చేసింది ఆయనే - కొడాలి నాని కౌంటర్
Kodali Nani on Bheemla Nayak: మంత్రి కొడాలి నాని ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం పక్షపాతం వహించడం లేదని అన్నారు.
Kodali Nani Press Meet: వ్యక్తులు ఎవరైనా సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతం చూపించడం లేదని మంత్రి కొడాలి నాని (Kodali Nani) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలనే ఉద్దేశంతో కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలన్నింటిని కలుపుకొని సీఎంను గద్దె నుంచి దింపాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, అందులో ఎవరూ బలిపశువులు కావొద్దని సూచించారు. భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి షరతులు కానీ, ఆంక్షలు గానీ పెట్టలేదని అన్నారు. గతంలో విడుదల అయిన అఖండ, పుష్ప, సీఎం జగన్‌కు (CM Jagan) సన్నిహితుడైన అక్కినేని నాగార్జున సినిమా బంగార్రాజు విషయంలో ఎలాంటి షరతులు, టికెట్ ధరలు ఉన్నాయో ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి భీమ్లా నాయక్‌ను తొక్కేయాలనే ఉద్దేశం తమకు లేదని అన్నారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఇంత తక్కువ స్థాయికి రావడానికి సీఎం చంద్రబాబే కారణం. ప్రొడ్యూసర్ల మాటలు విని కమిటీ వేయకుండా టికెట్ ధరలను విపరీతంగా వసూలు చేసేవారు. ఇంత జరుగుతున్నా.. కళ్లు లేని కబోదిలాగా ధృతరాష్ట్రుడిలాగా చంద్రబాబు వ్యవహరించారు. అందుకే చంద్రబాబుకు (Chandrababu) 25 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబుకు సహకరించిన మీడియా మొత్తం ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు వెల్ విషర్లు అయిపోయారు. గతంలో రాష్ట్రాన్ని పది మందికి దోచి పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉండడం సిగ్గుచేటు.
ఫిబ్రవరి 25 నాటికి సినిమా రేట్లు పెంచుతామని వైసీపీ నాయకులు గానీ, మేం గానీ ఎక్కడైనా చెప్పామా? మొన్న సినిమా పెద్దలు వచ్చి కలిసినప్పుడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. సినిమా పరిశ్రమను ఏపీలోకి తీసుకురావడానికి ఏం చేయాలి? వంటి అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ రేట్లు ఖరారు చేస్తాం. తర్వాత ఎలాంటి వివాదాలు రాకుండా జీవో ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది. మధ్యలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడం వల్ల కూడా జీవో విడుదలకు లేటయింది. ఇవన్నీ అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్‌కు తెలుసు. రాజకీయాల కోసం సినిమాలను అడ్డు పెట్టుకొనే స్థాయికి దిగజారడం విచారకరం. చంద్రబాబు నడిపిస్తున్న ఈ దారిలో నడవడం సిగ్గుచేటు.’’
‘‘భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ఆడినా ఆడకపోయినా ఆయనకు నష్టం ఏం లేదు. ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఆయనకు ఎప్పుడో అందింది. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం 25న సినిమా రిలీజ్ చేయాలని బలవంతం చేశారు. నష్టపోయినా ప్రొడ్యుసర్లు, డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి మీరు సహకరిస్తే రేపు ఒకవేళ ఆయన గెలిచినా మీకు ఏం దక్కదు. మీ ప్రయోజనం కోసం మీరు ముఖ్యమంత్రి అవ్వాలనో.. ప్రయత్నించండి.’’
సొంత అన్ననే విమర్శిస్తాడా: కొడాలి నాని
‘‘సొంత అన్ననే నరసాపురం మీటింగులో పవన్ కల్యాణ్ విమర్శించాడు. జగన్‌కు నమస్కరించి విన్నవించుకోవడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టాడు. ముఖ్యమంత్రి ఇగో సంతృప్తి చెందిందా అన్నాడు. చిరంజీవి దంపతులను ఇంటికి ఆహ్వానించినప్పుడు గుమ్మం నుంచి రిసీవ్ చేసుకొని ఇంట్లో దగ్గరుండి భోజనం చేసిన విషయం మర్చిపోయారా?’’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
‘‘బ్లాక్‌లో టికెట్లు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు గానీ, ఫలానా సినిమాకి ఆంక్షలు పెట్టడం ఏం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే భారీ మెజారిటీతో గెలుస్తారు. ఒంటరిగా పోటీ చేస్తారు. ఎవరైనా పొత్తుకు వచ్చినా పెట్టుకోరు. నోటికొచ్చినట్లు ఎల్లో మీడియా వాగితే ఊరుకునేది లేదు. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం జగన్ సీఎం అవుతారు. ప్రతి దాన్ని రాజకీయాలకోసం వాడుకోవద్దు. తన సోదరుడు చిరంజీవిని తక్కువగా చేయొద్దని పవన్‌కు హితవు పలుకుతున్నా’’ అని కొడాలి నాని విమర్శించారు.
సీపీఐ నారాయణ (CPI Narayana) పైనా తీవ్ర విమర్శలు
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ వివేకానంద రెడ్డి హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలపై కూడా కొడాలి నాని స్పందించారు. నారాయణ వింత జంతువు అంటూ తీవ్ర విమర్శ చేశారు. బిగ్ బాస్ హౌస్‌ను వ్యభిచార కొంప అంటూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగానే కొంత మంది మాట్లాడుతున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా కక్షగట్టారు: నాగబాబు (Nagababu)
ఏపీ టికెట్ ధరల విషయంలో పవన్ కల్యాణ్ బాహాటంగా విమర్శించడం వల్లే ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' నుంచి తాజాగా విడుదలైన 'భీమ్లా నాయక్' వరకూ జరిగిన పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఫిబ్రవరి 20న జీవో వస్తుందన్నారు. కానీ, రాలేదు. కల్యాణ్ బాబు సినిమా (భీమ్లా నాయక్) 25న విడుదల అని ప్రకటన రాగానే ఆలస్యం చేశారు. పాత రేట్లు అమలు చేశారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని మాకు క్లియర్ కట్ గా అర్థం అయ్యింది" అని నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ వంటి హీరోకి ఈ విధంగా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని నాగబాబు ప్రశ్నించారు. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు ఇది సరికాదని చెప్పడం తప్ప పెద్దవాళ్ళు కల్యాణ్ బాబుకు మద్దతుగా మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తోటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడితే చంపేస్తారా? అని ఆయన సూటిగా అడిగారు. అలాగే, వాళ్ళ భయాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలమని అన్నారు.
'భీమ్లా నాయక్' మాసివ్ హిట్ అయ్యింది కాబట్టి, ప్రజలు ఆదరించారు కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాత - పంపిణీదారులు నష్టపోయేవారని నాగబాబు వివరించారు. అదృష్టం కొద్దీ సినిమా భారీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఇవాళ కల్యాణ్ బాబుకు జరిగినట్టు రేపు మరొకరికి జరిగితే? ఇదే సమస్య మరొకరికి ఏ ప్రభుత్వం ద్వారా వచ్చినా? తాను గానీ, తన తమ్ముడు కల్యాణ్ అండగా ఉంటామని నాగబాబు తెలిపారు. 'మీరు మమ్మల్ని వదిలేసినా... మీకు మా సపోర్ట్ ఉంటుంది' అని చిత్ర పరిశ్రమ ప్రముఖులకు నాగబాబు చెప్పారు.