Minister Ambati Rambabu: చంద్రబాబుకు చర్మ వ్యాధి కొత్తగా ఇప్పుడే వచ్చిందా? మంత్రి అంబటి రాంబాబు
రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై హైడ్రామా నడుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
రాజకీయ లబ్ది కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై హైడ్రామా నడుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సంధర్భంగా మీడియాతో మంత్రి రాంబాబు పలు విషయాలు వెల్లడించారు.
గుంటూరు లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు చర్మ వ్యాధి కొత్తగా ఇప్పుడే వచ్చిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పటి నుంచో చర్మ సమస్య ఉందని, ఇదంతా బాబు సింపతీ గేమ్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులు ఎలా అబద్దాలు చెప్పగలుతున్నారు అని మండిపడ్డారు. సానుభూతి కోసమే ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఎలాగైనా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి చంద్రబాబుని తరలించాలన్నదే టీడీపీ ప్లాన్ అని అన్నారు. ఏసీ కావాలంటే కోర్టులో పిటిషన్ వేయకుండా 35 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? అని నిలదీశారు.
పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలో చెప్పాలని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కుమార్తెగా ఉండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చొరబడటం ఆమెకు అలవాటుగా మారిపోయిందని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ చాలా బలంగా ఉందని స్పష్టం చేశారు. ప్రత్యర్థిని అక్రమంగా అరెస్టు చేసి లబ్ధిపొందాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుందని చెప్పారు.
కుటుంబ సభ్యులే అసత్య ప్రచారం....
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకి ప్రాణాపాయం ఉందని.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. దురుద్దేశంతో క్రూరంగా చంద్రబాబు ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే అని దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని విషపూరిత ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు.
టీడీపీలో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్ నాయకుడు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఇంకా తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని యనమల అంటారు. చంద్రబాబు జైలులోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఇప్పుడు 67 కేజీలు బరువు ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు బరువు తగ్గితే 61 కేజీలు ఉండాలి గానీ .. ఇప్పుడు 67 కేజీలు ఎలా ఉన్నారు? అని ప్రశ్నించారు.
జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక ఆహారం, మందులు తీసుకునే అవకాశం ఇచ్చారు.. 17a ప్రకారం చంద్రబాబుపై కేసు కొట్టేయాలని చేసిన డిమాండ్ ను కోర్టులు తిరస్కరించాయి.. తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాలను తారు మారు చేస్తాడనే ఉద్దేశంతో కోర్టులు ఇప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారు.
ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం
చంద్రబాబును నిన్న ములాఖత్‌లో టీడీపీ నాయకులు నారా లోకేశ్, జ్ఞానేశ్వర్, భువనేశ్వరి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎందుకు అంటే.. మీడియాకు అబద్ధాలు అయినా నిజాలైనా చెప్పాల్సి వస్తుందని వెళ్లిపోయారు. చంద్రబాబుకు చాలా కాలం నుంచే చర్మ సంబంధ వ్యాధి ఉంది. ఏసీ పెడితే అది కూడా సర్దుకుంటుంది. న్యాయవాదులు వాదించాలి కానీ.. ఫ్రస్టేషన్‌తో న్యాయవాదులపై దాడులు చేయటం ఏమిటి? అని ప్రశ్నించా. ఇకనైనా క్షుద్ర రాజకీయాలు మానుకోవలని అంబటి రాంబాబు హితవు పలికారు.