Andhra Pradesh River Water Level: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిండుకుండల్లా జలాశయాలు-కీలకహెచ్చరిక లు జారీ చేస్తున్న అధికారులు
Andhra Pradesh River Water Level: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా ప్రాజెక్ట్ జలాశయాలు మారాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Andhra Pradesh River Water Level: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత వారం అంతా విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నదులు పోటెత్తాయి. ఒక్క రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ వర్షాలు మొదలవడంతో ఆ నీరు అంతా వచ్చి నదుల్లో చేరుతోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు భారీగా చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా సూచించారు. అలాగే వినాయక చవితి రోజులు కావడంతో నిమజ్జనాల కోసం నదుల దగ్గరికి వెళ్లకుండా ఉండాలని భక్తులకు సూచించారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం నాటికి వివిధ ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం ఇలా ఉంది .
పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం
- శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.06, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులు
- నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.69, ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులు
- పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3.13, ఔట్ ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులు
- కృష్ణా వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
- ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులు
పెరుగుతున్న గోదావరి
- భద్రాచలం వద్ద ప్రస్తుతం 37.70 అడుగుల నీటిమట్టం
- కూనవరం వద్ద నీటిమట్టం 15.78 మీటర్లు
- పోలవరం వద్ద 10.16 మీటర్లు
- ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 5.31 లక్షల క్యూసెక్కులు
- రేపటికి దాదాపు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం
వరద ప్రవాహం పెరుగుతుండడంతో కృష్ణా,గోదావరి నదిపరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.





















