పాస్‌బుక్‌లు, తాళాలు ఇచ్చేసి పింఛన్‌లు తీసేయండి- సీఎం జగన్‌కు పవన్ లేఖ
లబ్ధిదారులను తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవని అందులో కొన్ని కారణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు పవన్ కల్యాణ్. అలాంటి వాటిలో కొన్నింటిని సీఎం జగన్‌కు వివరించారు పవన్.
సామాజిక పింఛన్లు తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను తగ్గించకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు లెటర్ రాశారు. ఏదో సాకుతో అర్హుల జాబితాను కుదించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అందుకే లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు.
లబ్ధిదారులను తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవని అందులో కొన్ని కారణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు పవన్ కల్యాణ్. అలాంటి వాటిలో కొన్నింటిని సీఎం జగన్‌కు వివరించారు పవన్. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి... ఒక్కొక్కరి పేరు మీద వేల ఎకరాల భూములు ఉన్నట్టు చూపించారని తెలిపారు. అదే నిజమైతే... ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు వాళ్లకు ఇచ్చి పింఛన్లు తొలగించేయాలన్నారు.
పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధార పడిన రామక్క అనే లబ్ధిదారుకి 150 ఇళ్లు ఉన్నాయని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. నిజంగానే అన్ని ఇళ్లు రామక్కకు ఉంటే... అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఆమెకు ఇచ్చేసి పింఛన్ తీసినా తప్పులేదన్నారు.
మెళియాపుట్టి వృద్ధులైనా, రజకవృత్తి చేసుకునే రామక్క అయినా అందరూ పేదవాళ్లేనని... తండ్రి నుంచి తాతల నుంచి వచ్చే ఆస్తులు ఏమీ లేవనిగ్రహించాలన్నారు. మీరు చూపించిన రికార్డుల ప్రకారం ఆస్తిపరులైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, వాలంటీర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారని ప్రశ్నించారు.
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి @ysjagan గారికి ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి.
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2022
విషయం: సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QKnW6yXq6i
విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందో రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు పవన్. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటాయని... ఒకే ఇంటి నెంబర్లతో మూడు నాలుగు వాటాలు ఉంటాయన్నారు. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులకు, వితంతువుల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు.
ఇలా నోటీసులు ఇవ్వడాన్ని సీఎం సమర్ధిస్తున్నాని... పాతికేళ్ల కింద చనిపోయిన వారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారని నోటీసుల్లో చూపించి వితంతువు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ఈ తరహా నోటీసులు సమర్థనీయమా అని ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు దివ్యాంగులకు కూడా ఇబ్బంది కలుగచేస్తున్నాయని అన్నారు.
పది పదేహేనేళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు నాటి ధ్రువపత్రాలు నేడు చూపించమడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు జనసేన అధినేత. వారి వైకల్యం కళ్లెదుటే కనిపిస్తున్నా... లబ్ధికి దూరం చేస్తామనడం భావ్యమా అని నిలదీశారు.
జనసేన తరఫున నిర్వహించే జనవాణి కార్యక్రమంలో అనేక మంది దివ్యాంగులు, తమకు పింఛన్లు అందటం లేదని... పింఛన్లు రాకుండా రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇలా పింఛన్లపై వాస్తవ పరిస్థితులు తెలియజేస్తుంటే... తిట్టండి అని జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించారనే భావిస్తున్నారా అని పవన్ ప్రశ్నించారు. అవ్వా.. తాతా.. అంటూ మూడు వేలు పెన్షన్ ఇస్తాను అని మీరు చెప్పిన హామీని ఆ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ పింఛన్లు సంఖ్య పెరుగుతూనే ఉంటుందని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలన్నారు. అంతేగానీ... పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలని అనుకోవడం సరికాదన్నారు. ఆర్థిక దివాళా కోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏంటని... సామాజిక పింఛన్ అందుకొంటున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు పవన్.