గుంటూరులో ఎమ్మెల్యే కూతురు ఫ్లెక్సీల కలకలం - ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారో !
ప్రస్తుతం గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు ముస్తాఫా. ఆయన కుమార్తె ఫాతిమా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె నూరి ఫాతిమా పేరుతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ నగరంలో కలకలం రేపింది. సొంత పార్టీ నేతలే ఆ ఫ్లెక్సీ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు ముస్తాఫా. ఆయన కుమార్తె ఫాతిమా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గోనగా, స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో ఆమెను ఏకంగా ఎమ్మెల్యేగా పేర్కొనడంతో పార్టీలో హీటు మొదలైంది. అయితే పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, టీడీపీ టికెట్ మీద గెలుపొంది, వైసీపీకి దగ్గర అయ్యారు.
గుంటూరులో అలా ఎలా....
గుంటూరు నగరంలో రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంది. ఎవరు ఎలా వ్యవహరాలు సాగిస్తారో, పక్కన ఉండే వారికి కూడా అంత తేలికగా అర్థం కాదు. ఇప్పుడు జరిగింది కూడా ఇదే. గుంటూరు నగరంలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ముస్తాఫా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మద్దాలి గిరి ఉన్నారు. ఆయన టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఇది ప్రస్తుత గుంటూరు సిటీలోని ఎమ్మెల్యేల పరిస్దితి.
ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఇటీవల గుంటూరు నగరంలో జరిగాయి. వాటిలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె ఫాతిమా పాల్గొన్నారు. ఆమెకు స్వాగతం పలుకుతూ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఫాతిమాను ఏకంగా పశ్చిమ ఎమ్మెల్యే గా పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పడు గుంటూరులో రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ బ్యానర్లు ఏర్పాటు చేసింది కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కావటంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్గాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమ ఎమ్మెల్యే వర్గం మండిపాటు...
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నమద్దాలి గిరి వర్గం ఆ ఫ్లెక్సీలపై గుర్రుగా ఉంది. కనీస సమాచారం లేకుండా పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూతురు తన నియోజకవర్గంలో హల్ చల్ చేయటం, అది కూడా ఎమ్మెల్యేగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అసలు బ్యానర్లు ఏర్పాటు చేసింది ఎవరు, వారి వెనుక రాజకీయ వ్యవహరాలు ఏంటనే విషయం పై పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వర్గం ఆరా తీస్తోంది.
ఎమ్మెల్యే వర్గం వ్యతిరేకులే...
పశ్చిమలో గెలిచిన మద్దాలి గిరి టీడీపీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎసు రత్నం వర్గం మద్దాలి గిరిని వ్యతిరేకింది. ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో, పార్టిలో కీలక నేత, ఎమ్మెల్సీగా ఉన్న అప్పి రెడ్డి.. గిరిని ప్రోత్సహించారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో కనీసం ప్రోటో కాల్ పాటించకపోవటం, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న ఎసు రత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అంటూ పశ్చిమ నియోజవర్గం పేరుమీద ఫాతిమా ఫ్లెక్సీలు కనిపించటంతో గుంటూరు పశ్చిమ వైసీపీలో ఏం జరుగుతుందోనని స్థానికంగా గందరగోళం నెలకొంది.
నెక్ట్స్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమేనా....
వచ్చే ఎన్నికల్లో ఫాతిమా పశ్చిమ నియోజవకర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంంటే, తొందరపడిన కోయిల పరిస్దితి అవుతుందన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతుంది. తండ్రి తూర్పు లో ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు కూతురు పశ్చిమంలో పాగా వేయటం అంటే, పార్టీలో సాధ్యం అవుతుందా అని విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయం పై పార్టీలోని మైనార్టీ నేతలను టచ్ చేస్తే, వైసీపీ కాకపోతే మరో పార్టీలో ఫాతిమా పోటీలో ఉంటారని వారి వర్గీయులు ధీమా వ్యక్తం చే్స్తున్నారు.