Divya Vani: ఆయన్ని ప్రశ్నించడమే తప్పైంది, ప్రెస్ మీట్ల కోసం అడుక్కున్నా - బాబును ఏమన్నా అంటే తట్టుకోలేను: దివ్యవాణి
TDP నుంచి వైదొలుగుతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఏడాది కాలంగా పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పారు. ఓ నేతను ప్రశ్నించినందుకు నేతలంతా తనను దూరం పెట్టారని అన్నారు.
టీడీపీ అధికార ప్రతినిధిగా, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి దివ్యవాణి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడేందుకు గురువారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నుంచి వైదొలుగుతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఏడాది కాలంగా పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పారు. ఓ నేతను ప్రశ్నించినందుకు నేతలంతా తనను దూరం పెట్టారని అన్నారు. తనను ఎవరు ఎన్ని మాటలు అన్నా తాను పట్టించుకోబోనని, కానీ ఎవరైనా చంద్రబాబును మాట అంటే మాత్రం తాను తట్టుకోలేనని అన్నారు.
‘‘బుద్ధి లేని వాళ్లు.. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఏదో ప్యాకేజీ అందిందని అందుకే రాజీనామా చేయడం లేదని విమర్శించారు. మహానాడులో తన పేరు రాలేదని, అందుకే ఇప్పుడు హైలెట్ చేసుకుంటోందని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారి మాటలు నేను పట్టించుకోను. చివరి నిమిషం వరకూ క్లారిటీ తీసుకునేందుకే నేను ఆగాను. దివ్యవాణి అంటే బాపు బొమ్మ అనేది మర్చిపోయి నాపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో గాజు బొమ్మలాగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద హీరోలతో కేవలం స్వాభిమానం చంపుకోలేక మాత్రమే నటించలేదు. అలాంటి నాపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నాను. ఒక మంచి నేత వద్ద పని చేస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందనే ఆశయంతో టీడీపీలో చేరాను.’’
‘‘ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల టీడీపీ అనే కార్యక్రమం తెలంగాణలో జరిగింది. అందులో కూడా నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబుకు చెప్తామంటే కలిసే అవకాశం ఇవ్వట్లేదు. మహిళా అధ్యక్షురాళ్లకి, పొలిట్ బ్యూరో సభ్యులకు నియోజకవర్గాలు అప్పజెప్పారు. కానీ, అధికార ప్రతినిధి అయిన నేను ప్రెస్ మీట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు ఎదురైంది. ఆఖరికి ఓ కార్యక్రమానికి టీడీపీ కార్యక్రమానికి హాజరవుతుంటే.. ఓ బాయ్ నన్ను ఆపేశాడు. మిమ్మల్ని రానివ్వద్దని అన్నారు. టీడీ జనార్థన్ అనే వ్యక్తిని నేను ప్రశ్నించినందుకు నాకు నరకం చూపిస్తున్నారు.’’ అని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.’’
అలాంటివారు జర్నలిస్టులు కాదు
‘‘కొంత మంది ఇడియట్స్ జర్నలిజం ముసుగులో కొన్ని కథనాలు రాశారు. అలాంటి ఇడియట్స్ కి చెప్తున్నాను. ఒరేయ్ ఇడియట్.. విను. దివ్యవాణి అన్ని ప్రెస్ మీట్లు ప్రార్థనతో స్టార్ట్ చేయలేదు. సమస్య క్రైస్తత్వానిది కాబట్టి, క్రీస్తు గురించి ఏం మాట్లాడినా ముందు.. అందులో వ్యర్థమైంది ఉంటే తీసేసి కావాల్సింది ప్రజలకు అందించు అని ప్రార్థనతో స్టార్ట్ చేయడం అనే పద్ధతి బైబిల్‌లో ఉంది. ఆ పద్ధతిని ఫాలో అయ్యాను. అంతేకానీ, టీడీపీ ప్రెస్ మీట్ లో కూర్చొని నేను ప్రార్థనలు చేయలేదు. నాపైన అడ్డగోలు విమర్శలు చేస్తున్న వారికి ఇదంతా చెప్తున్నా. నిజానికి బయటికి తీసుకొచ్చేవాడే జర్నలిస్టు. అంతేకానీ, మా బాధ ఏంటో మా పరిస్థితి ఏంటో తెలీకుండా మాట్లాడేవాడు జర్నలిస్టు కాదు.’’ అని దివ్యవాణి ఫైర్ అయ్యారు.
అచ్చెన్నను ఎందుకు శిక్షించలేదు?
నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? అచ్చెన్నాయుడు లాగా పార్టీ లేదు బొక్కా లేదు అని అన్నానా? నేనేదో అన్నానని నన్ను తప్పు పట్టిన వాళ్లు.. పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నని ఎందుకు శిక్షించలేదు? సాధినేని యామిని లాగా నేనేం విమర్శలు చేయలేదే? నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి డాగ్స్ లా ఉంటున్నారు. నారీ-భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడడం లేదు. చంద్రబాబు నా తండ్రి లాంటి వారు. రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నా.
‘‘నేనేం తేడాగా మాట్లాడలేదే? మతమార్పిడుల విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు క్రైస్తవులు ఆగ్రహనికి గురయ్యారు. క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్ పెట్టించారు.. నేను చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి నెమ్మదిగా టీడీపీలో నా డౌన్ ఫాల్ మొదలైంది. టీడీ జనార్జన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు. కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని నాకు చాలా మంది చెప్పినా వినలేదు.’’ అని దివ్యవాణి ఆవేదన చెందారు.