సీఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి- కమిషనర్‌కు ఎమ్మెల్సీ వినతి
అమరావతి రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు సమస్యలు తీర్చాలని కోరుతూ ఎమ్మెల్సి కె ఎస్ లక్ష్మణరావు, సీపీఎం నేత సిహెచ్ బాబురావు సీఆర్డీఎ కమిషనర్‌ను కలిశారు.
అమరావతి రాజధానిలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని నిలిపివేసిన పెన్షన్ పునరుద్ధరించాలని ఎమ్మెల్సి కె ఎస్ లక్ష్మణరావు, సీపీఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఆర్డీఎ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
అమరావతి రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు సీపీఎం నేతలు. జనవరి నుంచి పనిలో కొనసాగించాలని కార్మికులకు పనిలో భద్రత కల్పించాలని అభ్యర్థనలో పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలిపివేసిన పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సి కె ఎస్ లక్ష్మణరావు, సీపీఎం నేత సిహెచ్ బాబురావు సీఆర్డీఎ కమిషనర్‌ను కలిశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటి వరకు నిలిపివేసిన పెన్షన్ కూడా ఇవ్వాలన్నారు. విజయవాడలో సి ఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ ను కలిసి సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు.
తిరిగి కొనసాగించాలి...
2017 నుంచి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జనవరి నుంచి కొనసాగించాలని వివేక్ యాదవ్‌ను సీపీఎం నేతలు కోరారు. దాదాపు 29 గ్రామాల్లో కార్మికులున్నారని వారికి సేవలు కొనసాగించే ప్రయత్నం చెయ్యాలి అన్నారు. డిసెంబర్ చివరికి కాంట్రాక్ట్ ఏజెన్సీ ముగుస్తున్నందున కొత్త టెండర్ పిలిచి తిరిగి వారికి జనవరి నుంచి యథావిధిగా పనులు కొనసాగించాలన్నారు. ఈ మేరకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉపాధి లేకుండా చెయ్యవద్దని, పనులు నిలిపివేస్తే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులపై జాలి చూపించి వారికి ఉపాధి కల్పించాలని, రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తే అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాల్లో చెత్తాచెదారం పేరుకుపోతాయి వాటి వల్ల ప్రజలు అనారోగ్యాన పడతారు అని తెలిపారు. ప్రభుత్వం వారికి పనులు కల్పించి సాయం చెయ్యాలన్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా కృషి చెయ్యాలన్నారు. ఉద్యోగుల పేరుతో పారిశుద్ధ్య కార్మికులకు తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు డిసెంబర్ 23 నాటికి వారి జీతాలు మొత్తం చెల్లించినందుకు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సిఆర్డిఏ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి జనవరి నుంచి మల్లీ పనులు ప్రారంభం అవ్వాలని కోరారు. వారి పెన్షన్లు కూడా నిలిపి వేయొద్దని కోరారు.
సంవత్సర కాలంగా పోరాటాలు...
రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. దీంతో కార్మికుల పరిస్థితి అంతుపట్టడం లేదు. కార్మికులకు జీతాలు చెల్లించాల్సిన కాంట్రాక్ట్ సంస్థలకు సీఆర్డీఎ అధికారులు టెండర్లు పిలవకపోవటంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ హక్కులను కాపాడాలని కోరుతూ కార్మికులు సంవత్సర కాలంగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వారికి తగిన హామీ లభించటం లేదు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న కార్మికులను గుర్తించి వారిని పర్మనెంట్ చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇబ్బందులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపట్టి, సీఎం కార్యాలయం ముట్టడికి సమాయత్తం అవుతామని కార్మిక సంఘలు హెచ్చరిస్తున్నాయి.