Fact Check: నేడు ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు, బీజేపీ మద్దతు తెలిపిందా?
TDP calls for AP Bandh Today: టీడీపీ ఇచ్చిన బంద్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు.
TDP calls for AP Bandh Today:
విజయవాడ: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. దాంతో టీడీపీ శ్రేణులు సోమవారం (సెప్టెంబర్ 11న) రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే టీడీపీ ఇచ్చిన బంద్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.
చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టీడీపీ బంద్ కు పిలుపునివ్వగా, బీజేపీ మద్దతు తెలిపినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీడీపీ బంద్ కు మద్దతిస్తున్నట్లు బీజేపీ లెటర్ హెడ్ పై తాను మద్దతు తెలిపినట్లు ఓ ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్ కు కారకు పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేస్తామన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.
మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, టీడీపీ బంద్ కు పిలుపునివ్వగా బీజేపీ సంఘీభావం తెలిపినట్లు ఆ లెటర్ హెడ్ లో ఉంది. టీడీపీ నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతోంది. కనుక బీజేపీ శ్రేణులు ధర్నాలలో పాల్గొని చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని మనవి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో లెటర్ హెడ్ వాట్సాప్ లో వైరల్ గా మారడంతో ఆమె స్పందించారు. బీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదని, జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
పలు చోట్ల రోడ్లపైకి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కందుకూరులోని పామూరురోడ్డు జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు మానవహారంగా నిలబడి ఆందోళన చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, సైకో దిగిపోవాలి, చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నేతలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబును కేసులలో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.