మార్గదర్శి కేసులో తనిఖీలు చేస్తే బీబీసీ తరహాలో స్పందించాలి - చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు
బెటర్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘చిట్స్, ఫైనాన్స్ సంస్థల మోసాలు - నివారణా మార్గాలు’ అన్న అంశంపై విజయవాడలో చర్చా కార్యక్రమం జరిగింది.
కొందరు రాజకీయ నాయకులు మనీ లాండరింగ్‌కు మార్గదర్శిని వాడుకుంటున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌తో విచారణ జరిపించాలని, మార్గదర్శిలో సోదాలు మీడియాపై దాడిగా భావించకూడదని పలువురు పౌర సంఘాల ప్రతినిధులు అన్నారు.
మార్గదర్శి వ్యవహరంపై చర్చ
బెటర్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘చిట్స్, ఫైనాన్స్ సంస్థల మోసాలు - నివారణా మార్గాలు’ అన్న అంశంపై విజయవాడలో చర్చా కార్యక్రమం జరిగింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వీవీఆర్. కృష్ణంరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ, మార్గదర్శి పై సోదాలు జరిపితే అది మీడియా దాడిగా భావించకూడదన్నారు. ఇటీవల ఢిల్లీలో బీబీసీ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ సోదాలు జరిపితే ఆ సంస్థ ప్రతినిధులు హూందాగా సహకరించారే తప్ప మీడియాపై దాడిగా గగ్గోలు పెట్టలేదని అన్నారు. అనేక టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు ఉన్న సహారా ఇండియా అధినేతను ఆర్థి అక్రమాలపై అరెస్ట్ చేసినప్పుడు కూడా దానిని మీడియాపై దాడిగా ఆ యాజమాన్యం భావించలేదని గుర్తు చేశారు.
ఆరోపణలను మార్గదర్శి రుజువు చేసుకోవాలి
మనీ లాండరింగ్‌కు కేంద్రంగా మార్గదర్శి మారిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, కొందరు రాజకీయ నాయకులు విదేశాల్లోని తమ ధనాన్ని మార్గదర్శికి మళ్ళిస్తున్న అనుమానాలున్నాయని దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌తో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి వ్యాఖ్యానించారు. మార్గదర్శి యాజమాన్యం, విచారణా సంస్థలకు సహకరించి తన నిజాయతీని నిరూపించుకోవాలని వెంకట్ అన్నారు. సి.ఆర్. ఎ.పి. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావు కోర్టు ఆదేశాలతో రూ. 2600కోట్ల రూపాయలు తిరిగి చెల్లించారని గుర్త చేశారు. మళ్ళీ మరోసారి మోసానికి పాల్పడి కోట్లాది ప్రజాధనాన్ని మళ్ళించినందునే రామోజీరావు విచారణా సంస్ధలకు సహకరించడం లేదన్నారు.
రామోజీరావు కోర్టుకు సమర్పిస్తున్న అఫిడవిట్లతో ఒకసారి తనకు మార్గదర్శితో సంబంధం లేదని.. మరోసారి తానే ఛైర్మన్నని చెబుతున్నారని తెలిపారు. మార్గదర్శిపై సోదాలను రామోజీరావు జగన్ మాయగా అభివర్ణిస్తున్నారని నిజానికి రామోజీరావే జగన్‌ను, దర్యాప్తు సంస్ధలను మాయ చేస్తున్నారని అన్నారు. మార్గదర్శి నుంచి నిధుల మళ్ళింపు జరిగిందా? లేదా ? అన్న దర్యాప్తు సంస్ధల ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పడం లేదని ఆయన విమర్శించారు.
మీడియా రక్షణ కవచం
తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి మీడియాను ఒక రక్షణ కవచంగా వాడుకోవడం అలవాటుగా మారిందని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సైకం భాస్కరరావు అన్నారు. రామోజీరావు విచారణా సంస్థలకు సహకరించి తన నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు. ప్రముఖ ఇన్‌కం టాక్స్ కన్సల్టెంట్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ, చిట్‌ఫండ్ సంస్థలు చందాదారుల డబ్బులను ఒక్క పైసా కూడా మళ్ళించకూడదని, స్వంతానికి వాడుకోకూదడని అన్నారు. అయితే మార్గదర్శి ప్రజాధనాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా దర్యాప్తు సంస్ధలు గుర్తించాయని ఇది తీవ్రమైన నేరమని అన్నారు. తరచుగా ఒడుదొడుకులకు లోనయ్యే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన డబ్బు విలువలు పడిపోతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.