(Source: Poll of Polls)
AP Highcourt News : ఆర్ - 5 జోన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ - పొలాల్ని చదును ప్రారంభించిన అధికారులు !
ఆర్ 5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.
AP Highcourt News : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రాజధాని అవసరాల కోసం తప్ప భూముల్ని ఇతర అవసరాలకు వాడకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందని.. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ కొత్తగా ప్రభుత్వం ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసిందని రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇతర ప్రాంతాల నుంచి లబ్దిదారులను అమరావతికి తీసుకు వచ్చిన రాజధాని భూముల్లో స్థలాలిస్తున్నారని వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పేదలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతోనే ఆర్5 జోన్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
సెంట్ స్థలాలను చదును చేయడం ప్రారంభిచిన అధికారులు
అయితే అంతకు ముందు అమరావతి భూముల్లో పేదలకు ఇవ్వాలనుకున్న కోట్ల చదును చేయడం ప్రారంభించారు. సీఆర్డీఏ సెంట్ స్థలాల వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. అయితే కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయలేదు. అయినప్పటికీ అధికారులు జేసీబీలతో చదును చేయడానికి ప్రయత్నించారు. కోర్టులో కేసు ఉండగానే ఎలా పనులు చేస్తారని రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పనులు కొనసాగించారు.అమరావతిలోని 20 వేర్వేరు లేఅవుట్లలో ఉన్న 1134.59 ఎకరాల భూమిని పేదలకు చెందిన 48,218 ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని కోసం సేకరించిన భూముల్లో బయట ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు
రాజధాని ప్రాంతంలోని ఇనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమనూరు గ్రామాల్లో 20 లేఅవుట్లు ఉన్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు. కోర్టు కేసుల ఫలితాలకు లోబడి మే మొదటి వారం నుంచి ప్రతిపాదిత లేఅవుట్‌లకు స్పష్టమైన రూపం ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే కోర్టు కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. అయినప్పటికీ పనులు ప్రారంభించారు. పథకం మూడో దశ కింద లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు అందచేయాలని నిర్ణయించారు.
రాజకీయ కుట్రతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని రైతుల ఆరోపణలు
APCRDA చట్టంలోని సెక్షన్ 41(3), (4) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించి R-5 జోన్ (రెసిడెన్షియల్ జోన్) సృష్టించింది . అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ భూములను తన పరిధిలోకి తెచ్చింది. పూర్తి స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమైనా నోటిఫికేషన్ ఇచ్చిందని రైతులు కోర్టుకు తెలిపారు. కోర్టు ఇచ్చే తీర్పుపై ఇప్పుడు ఆ భూముల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒక వేళ త్రిసభ్య ధర్మాసనం తీర్పు మేరకు రాజధాని అవసరాల కోసమే ఆ భూముల్ని వినియోగించాలని హైకోర్టు చెబితే... పేదలకు ఇళ్ల పంపిణీకి వేరే చోట్ల స్థలాలు చూడాల్సి ఉంటుంది. లేకపోతే అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రకటించిన కీలక నిర్మాణాల స్థలంలో సెంట్ స్థలాలు నిర్మితమవుతాయి.