Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పలు విభాగాల్లో వారికి ట్రైనింగ్ ఇచ్చే సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh Women Empowerment News: దేశంలోనే అత్యధిక మహిళా పొదుపు సంఘాలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన అడుగు వేస్తోంది. పొదుపు సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెప్మా (MEPMA) డ్వాక్రా (Dwacra) సభ్యుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.
మహిళా సంఘాలకు కేవలం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా అత్యాధునిక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. వారికి సులభతరమైన రుణాల మంజూరు చేయనున్నారు. మార్కెటింగ్ కోసం బ్రాండింగ్ రూపొందిస్తారు. సంపూర్ణ పారదర్శకతను అందించే వాట్సప్ సేవలతో ఒక సమగ్ర ప్యాకేజీ సిద్ధం చేశారు. మహిళల వ్యాపారాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా, వారి ఉత్పత్తులు ఈ-కామర్స్ వేదికలపై అమ్ముడుపోయేలా పథకాలకు రూపకల్పన చేస్తున్నారు.
డిజిటల్ బాటలో ప్రజ్ఞ
సాధారణంగా స్వయం సహాయక బృందాలు కేవలం పొదుపు, పరస్పర రుణాలు తీసుకోవడంపై దృష్టి పెడతాయి. కొత్త ప్లాన్ ప్రకారం ప్రతి సంఘ సభ్యురాలు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే 8 రకాల సేవల్ని మెప్మా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో అత్యంత ప్రత్యేకమైనది ‘ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ’. ఈ అకాడమీ ద్వారా మహిళా సభ్యులకు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత వంటి అత్యంత కీలకమైన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మొత్తం 12 రకాల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల రూపంలో అందుబాటులో ఉంది.
21వ శతాబ్దంలో వ్యాపారం చేయాలంటే డిజిటల్ నైపుణ్యాలు చాలా అవసరం. డబ్బును నిర్వహించడం, ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం, నగదు లావాదేవీల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన ఉండాలి. వారు కేవలం చిన్న యూనిట్‌లను నడపడమే కాక, ఆధునిక వ్యాపార ప్రపంచానికి సరితూగేలా తీర్చిదిద్దడం ఈ 'ప్రజ్ఞ' లక్ష్యం. ఈ ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా, సంఘ సభ్యులు స్వయం ఉపాధికి సంబంధించిన 12 రకాల అవకాశాలను అందిపుచ్చుకునే వీలుకలుగుతుంది.
శిక్షణ తరువాత రుణ సహాయం, పది మందికి ఉపాధి
కేవలం శిక్షణతోనే ఈ పథకం ఆగడం లేదు. శిక్షణ పూర్తయిన వెంటనే, మహిళా పారిశ్రామికవేత్తలకు తమ వ్యాపారాలను స్థాపించడానికి వీలుగా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలను ఉపయోగించి యూనిట్లు స్థాపించిన మహిళ, కనీసం పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే, లక్ష మంది పారిశ్రామికవేత్తలు తయారైతే, వారు ప్రత్యక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది.
‘అవని’తో బ్రాండింగ్
మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు తరచుగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య మార్కెటింగ్. నాణ్యమైన బ్రాండింగ్ లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉంటోంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ‘అవని బ్రాండింగ్ మాన్యువల్’ అనే ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ‘అవని’ ద్వారా మెప్మా సభ్యుల ఉత్పత్తులన్నింటికీ ఈ-కామర్స్ వేదికలపై ఒకే రకమైన బ్రాండింగ్, ప్యాకింగ్ విధివిధానాలు రూపొందించారు. ఈ కొత్త విధానం ద్వారా మహిళల ఉత్పత్తులు ఒక ప్రొఫెషనల్ లుక్‌ను సంతరించుకోనున్నాయి. ఇలా చేయడం వల్ల ఆ ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు వస్తుంది. ఒకే రకమైన బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వెళ్లడం వల్ల, వినియోగదారుల్లో కూడా ఆ ఉత్పత్తులపై విశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా మంచి గుర్తింపు లభిస్తుంది.
వ్యాపార ఆలోచనలను పెంపొందించేందుకు ‘లైవ్‌లీహుడ్ ప్రమోషన్స్’ పేరుతో ఒక ప్రచార పుస్తకాన్ని సైతం ప్రచురించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు సులభంగా ప్రారంభించదగిన వివిధ వ్యాపార ఆలోచనలు ఇందులో ఉంటాయి.
మన మిత్రలో అన్ని లెక్కలు
ఇప్పటి వరకు ప్రజలకు ‘మన మిత్ర వాట్సప్ సేవలను’ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మహిళా సంఘాలకు కావాల్సిన వివరాలను పొందుపరుస్తున్నారు. ఇదో కీలకమైన మైలురాయిగా మారనుంది. ఈ వాట్సప్ సేవ ద్వారా, సంఘ సభ్యులు తమ వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చు. వారి పొదుపు, అప్పు, ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్ వివరాలు, సంఘాల ఆడిట్ నివేదిక వివరాలు కూడా ఈ ‘మన మిత్ర’ వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. సభ్యుల్లో విశ్వాసం పెరుగుతుంది. తమ ఆర్థిక స్థితిపై పూర్తి అవగాహన ఉండటం వల్ల, మహిళలు తమ వ్యాపార నిర్ణయాలను మరింత పకడ్బందీగా తీసుకోగలరు.
ప్రేరణా సఖి, లీప్ పుస్తకం
ఒక పథకం విజయం సాధించాలంటే, మార్గదర్శకత్వం, స్ఫూర్తి తప్పనిసరి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు ప్రత్యేక డాక్యుమెంటేషన్ ప్రక్రియలను చేపట్టింది. ఇందులో విజయం సాధించిన వారి వివరాలు, వారి కేస్ స్టడీని చెప్పనున్నారు.
1. ప్రేరణ సఖి (Prerana Sakhi): వీటి ద్వారా సంఘాల సభ్యుల్లో అత్యున్నత వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళల విజయగాథలను ప్రచురిస్తారు. ఈ విజయగాథలను మిగతా సభ్యులకు చెప్పడం ద్వారా స్ఫూర్తి పొంది, తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోగలరు.
2. లీప్ బుక్(Leap Book): ఈ పుస్తకం ద్వారా జీవనోపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న మహిళల వివరాలు అందజేస్తారు. ఆడిట్ నివేదికలను ఇందులో నమోదు చేస్తారు. ప్రభుత్వం పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించడానికి వీలుంటుంది.
పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, డిజిటల్ శిక్షణ, సాంకేతిక పారదర్శకత, ఈ-కామర్స్‌కు అనుగుణంగా బ్రాండింగ్ , సంస్థాగత శిక్షణ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వం మహిళా సాధికారతకు కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. దీంతో రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చిత్రాన్ని మార్చగలదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.





















