Chandrababu: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తా - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu Comments: రాజధాని అంశంపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో.. పైసా ఖర్చు లేకుండానే 5 కోట్ల మంది ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతి తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు.
CBN Comments: ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం ఏపీ సీఎం జగన్‌కు ఉందా అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఏపీలో తన వైఫల్యాలను పార్టీ ఎమ్మెల్యేల పైకి నెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని, ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. తమకు జగన్ మళ్లీ టికెట్ ఇవ్వరని వైసీపీ నేతలు భయపడుతున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతి రాజధానిపై వెనకడుగు వేసింది సీఎం జగనేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్షనేత జగన్ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఇదే అంశానికి కట్టుబడి ఉందని.. తెలిపారు. రాజధాని అంశంపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో.. పైసా ఖర్చు లేకుండానే 5 కోట్ల మంది ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతి తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు చేశామని.. ఖర్చు లేకుండానే 33 వేల ఎకరాల భూ సేకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రమంతటికీ సృష్టి కేంద్రం అవుతందని వివరించారు.
వైసీపీ ఎమ్మెల్యేలంతా భయపడిపోతున్నారు..
సీఎం జగన్ తో రేపో, మాపో జరిగే సమావేశానికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ టిక్కెట్లు రావనే భయం కొందరిలో ఉంటే.. వచ్చినా గెలవలేననే ఆందోళన వారిలో ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు చేస్తున్న ప్రజా పోరాటమే తిరిగి తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పినట్లు టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని తనతో ఓ మాట చెప్పారని అన్నారు. అందేంటంటే... పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పి.. దాని ఉద్దేశం అమరావతికి ఆయన అండగా ఉంటానని చెప్పడమే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మాటలు ఇప్పటికీ తన చెవుల్లో వినిపిస్తున్నాయని అన్నారు. ఈ సంకల్పం వృథా పోదని.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
కావాలనుకుంటే తిరుపతిలోనే రాజధాని పెట్టుకునేవాడిని..
వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ కులానికో, ఏ కొందరికో పరిమితం కాదని తెలిపారు. అమరావతిని ఐదు కోట్ల మంది ప్రజలకు మేలే చేసే ప్రజారాజధానిగా నిర్మించాలనుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రాంతమో, కులమో చూసుకుంటే.. తిరుపతిలోనే రాజధానిని పెట్టుకునేవాడినని, నారావారి పల్లె నుంచి రంగంపేట, తిరుపతి వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. కానీ తాను శాశ్వతం కాదని, నవ్యాంధ్రకు రాజధాని మాత్రమే శాశ్వతం అని ఆలోచించి.. అమరావతి రాజధానిగా చేయాలనుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమరావతి ఏ ఒక్కరికో పరిమితం కాదని.. అలా అనుకుంటే హైదరాబాద్ ని ఏ కులం కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్పీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయింది. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్ లో ఓడిపోయామని.. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కూడా తాను ప్రారంభించిన ఏ ఒక్క అబివృద్ధి పనిని అతను ఆపలేరని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా అలా చేయలేవని.. అందుకే హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని మరో మహా నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని కేంద్ర విభజన చట్టం ప్రకారం మంజూరు చేసిన సంస్థల్ని రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.