Nara Lokesh: టీచర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
Andhra Pradesh News: ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే టీచర్ల బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ఐదేళ్లలో డ్రాపౌట్స్ కు కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
![Nara Lokesh: టీచర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు AP minister Nara Lokesh comments on Teacher Transfers in state Nara Lokesh: టీచర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/ee48da4a01900700d7e972a6c303af211719418352954233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Teacher Transfers అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నారా లోకేష్ టీచర్ల బదిలీలపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీ పారదర్శకంగా జరగాలన్నారు. తాజాగా మరోసారి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇదే విషయాన్ని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను సూచించారు. స్కూల్ విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం నారా లోకేష్ దాదాపు 3గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విధివిధానాలు
ఉపాధ్యాయుల బదిలీల (AP Teacher Transfers) విషయంలో గతంలో లాగ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, విధివిధానాలని రూపొందించాలని కమిషనర్ ను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీచర్లకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు.
‘వచ్చే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అవసరమయ్యే నిధులు ఎంత, వాటిని సమకూర్చుకోవాలి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలి. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై’ ఉన్నతాధికారులతో లోకేష్ చర్చించారు.
అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేయాలన్న మంత్రి లోకేష్
దేశంలో అత్తుత్తమ విద్యా విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి లోకేష్ కోరారు. సమీక్షలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థల గురించి తెలుసుకోవాలని నారా లోకేష్ ప్రస్తావించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై ఫోకస్ చేయాలని, ఏ ప్రాంతంలో పాఠశాలల కొరత ఉందో చూసి, నూతన పాఠశాలలు ప్రారంభించాలనేది రిపోర్ట్ చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)