AP Pensions: అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
Andhra Pradesh News | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కారణంగా జీవనోపాధి కోల్పోతున్న భూమి లేని నిరుపేదలకు పెన్షన్ ను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది.

Pensions for landless families in capital Amaravati | అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని భూమిలేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వారికి ఇచ్చే పెన్షన్ ను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మిస్తున్న గ్రామాల్లోని 1575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ హయాంలో గత వైసిపి ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేయడం తెలిసిందే. 2015లో జరిగిన ఇంటింటి సర్వే ఆధారంగా 1575 నిరుపేద కుటుంబాలను అప్పటి చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.
ఏపీ కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు పెన్షన్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు పెన్షన్ మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి నిర్మాణానికి అదనంగా భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భూమిని ఇచ్చే వారికి ఎంత పరిహారం, ప్రయోజనం దక్కుతుందో పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అందులోనూ ఆ భూ సేకరణ కారణంగా జీవనోపాధి కోల్పోతున్న భూమి లేని నిరుపేదలకు పింఛన్ ఇస్తామని స్పష్టం చేసింది.
కాగా, నేలపాడులో ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ పెండింగ్ పనులకు ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 524 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు పరిపాలనా పరమైన అనుమతులు సైతం ఇచ్చింది. అక్కడ 18 టవర్లలో మొత్తం 432 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మిస్తున్నారని తెలిసింది.






















