AP CM Jagan: 'జగనన్నకు చెబుదాం'తో ప్రజాసమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
Jagananna ku Chebudham: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాంతో ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Jagananna ku Chebudham: CM Jagan: ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీది అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేదని, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని, వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం రోజే శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
స్థానిక జడ్పీటీసీలే ముఖ్య అతిథులు
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈఓలు, డీపీఓలకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అంద జేయడంతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు ఆహ్వానించాలని సూచించింది. అలాగే ప్రతీ వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ ఉంటుందన్నారు.
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి సమస్యలున్నా..!
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో ఈ కార్యక్రమం నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షమ పథకాలు అందుకోవడంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలు అందుకోవడంలో, రెవెన్యూ కార్డులకు, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1902 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. అయితే దానికి కాల్ సెంటర్ ప్రతినిధి సర్వీస్ రిక్వెస్ట్ ఐడీని కేటాయిస్తారు. అప్పటి నుంచి సమస్య ఎస్ఎంఎస్ విధానం ద్వారా అప డేట్ అవుతుంది. దాన్ని బట్టి మీ సమస్య ఎంత వరకు పరిష్కారం అయిందో తెలుస్తుంది. ఇలా మనం ఫిర్యాదు చేసినప్పటి నుంచి సమస్య పూర్తిగా తీరే వరకూ ఇది నడుస్తూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సీఎం జగన్ సూచించారు.