గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్
గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు జెండా ఊపి మొదలు పెట్టారు.
చిన్న రైతులకు మేలు జరిగేలా ఖర్చు తగ్గించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభించారు. వ్యవసాయంలో వంద శాతం యాంత్రీకరణ జరిగేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు సీఎం జగన్
ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు సీఎం జగన్. ఆ రైతన్నలే గ్రూపు కింద మారి ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొస్తారని తెలిపారు. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ తక్కువ ధరకు అద్దెకు ఇస్తారని వివరించారు.
నిజమైన గ్రామ స్వరాజ్యం
గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోందన్నారు సీఎం జగన్. ఇంతకు ముందు 6,525 ఆర్బీకే స్థాయిలో 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశామన్నారు. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశామని గుర్తు చేశారు.
వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగా పంపిణీకింద రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను అందించిన ముఖ్యమంత్రి. రైతుల గ్రూపులకు రూ.125.48 కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం. pic.twitter.com/R9N9gUMAdo
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 2, 2023
రైతులకు మంచి జరగాలని
ఈరోజు(శుక్రవారం) 3,919 ఆర్బీకే స్థాయిలో మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతోపాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులోకి ఉంచబోతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఆర్బీకే స్థాయిలో 15 లక్షల రూపాయలు కేటాయించి ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెప్పారు. వరి బాగా పండుతున్న 491 క్లస్టర్ స్థాయిలో కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఇదే మాదిరిగానే మళ్లీ ఈ సంవత్సరమే అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి చేస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం: సీఎం pic.twitter.com/4cwUcKNZ1z
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 2, 2023
అద్దెకు అధునాతన యంత్రాలు
ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను 25 లక్షల రూపాయలతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ తీసుకొస్తున్నామని వివరించారు. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10 శాతం కడితే చాలు.. 40 శాతం గవర్నమెంటే సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు.
ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతు అయినా వాడుకొనేందుకు అతి తక్కువ అద్దెతో ఇవన్నీ అందుబాటులో ఉండేందుకు వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను కూడా తీసుకొస్తున్నామన్నారు జగన్. వీటి వల్ల 15 రోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకొనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
ఈ సంవత్సరం అక్టోబర్‌లో 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగేలా వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు అందజేస్తామన్నారు. స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఇలాంటివి పంపిణీ చేయబోతున్నట్టు ప్రకటించారు. అర్బీకే వ్యవస్థను పటిష్ట పరుస్తూ రైతన్నలకు మంచి జరిగాలనే అడుగులు పడుతున్నాయన్నారు.