Chandrababu Bail: ఢిల్లీకి సీఐడీ లీగల్ టీం, చంద్రబాబు బెయిల్ సవాలు చేస్తూ సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్
Chandrababu News: చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు, ఆయన అనుచరుల ఖాతాలకు కాజేసిన నిధులను మళ్లించారనే ఆరోపణలకు సంబంధించి సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేకపోయిందని హైకోర్టు చెప్పింది. మాజీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అందుకే దీన్ని లోపంగా భావిస్తున్నామని వివరించింది.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో నిర్ధేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని అభిప్రాయపడింది. హైకోర్టు తన పరిధి దాటినట్లు అనిపిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. చంద్రబాబు నాయుడు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లిందని పిటిషన్ లో పేర్కొంది. వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండకూడదని.. అందువల్ల హైకోర్టు తీర్పు లోపభూయిష్టం అని వివరించింది. కేసు దర్యాప్తు దశలో దర్యాప్తులో లోపాలను ప్రస్తావించిందని, బెయిల్ పిటిషన్ విచారణను అడ్డంపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు అడ్డుగోడలా నిలిచాయని పిటిషన్ లో వివరించింది.