AP News: రానున్న ఎన్నికల్లో 83శాతానికి పైగా పోలింగ్ నమోదు లక్ష్యం - ముకేష్ కుమార్ మీనా
General Elections 2024: భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృందం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా ఏపీ సచివాలయంలోని వారి ఛాంబర్ లో మంగళవారం కలిసింది.
AP Elections 2024: ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లలో అవగాహన, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రమబద్దమైన ఓటర్లలో అవగాహన, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను (SVEEP – Systematic Voter's Education & Electoral Participation) సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృందం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా ఏపీ సచివాలయంలోని వారి ఛాంబర్ లో మంగళవారం కలిసింది.
ఈ సందర్బంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు అయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు పర్చడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి, ఓటరుకి ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కలిగించి, రానున్న ఎన్నికల్లో వారిని పెద్ద ఎత్తున బాగస్వామ్యులను చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.
ఇందుకే ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను, స్వీప్ నోడల్ అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా జిల్లాల వారీగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై తరచుగా సమీక్షలను నిర్వహించడం జరుగుతుందని భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృందానికి ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సభ్యులు సంతోష్ కుమార్ (కార్యదర్శి), రాహుల్ కుమార్, ఆర్.కె.సింగ్ తో పాటు అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ముకేష్ కుమార్ మీనాతో లక్ష్మీ నారాయణ భేటీ
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మీనాను జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. ఏపీ సచివాలయంలో అయిదో నెంబరు బ్లాకులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ కార్యాలయంలో మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా కొన్ని సూచనలను జైభారత్ నేషనల్ పార్టీ ఎన్నికల కమిషన్ కి అందిస్తోందని తెలిపారు. ఏపీలో ముఖ్యంగా 3 లక్షల మంది వలంటీర్లకు పోలింగ్ విధులను అప్పగించడంలో ఎన్నికల కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ వారిని వినియోగించదలిస్తే, కనీసం 300 కిలోమీటర్ల దూరంలో పోస్ట్ చేయాలని సూచించారు.