(Source: ECI/ABP News/ABP Majha)
AP Capital: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి - ఏపీ హైకోర్టులో పిల్
Hyderabad Joint Capital: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియబోతోంది. మరికొంత కాలం పొడిగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
AP Capital: తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు మరో మరో మూడు నెలల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. కానీ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంత కాలం పొడిగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ మేరకు ఒక చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సెక్రెటరీని ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియబోతోంది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తులు, అప్పులు, 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవాసంఘం సెక్రెటరీ పొదిలి అనిల్ కుమార్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించిందని పిటిషన్ పేర్కొన్నారు. అందుకే విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సహకారం, పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం వంటివి లోపాలని అన్నారు. చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం వల్ల.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందని అన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని పిటిషన్ పేర్కొన్నారు.