Perni Nani On TDP : అబద్ధాల పుస్తకంలో భారతి ఫొటో వేస్తారా? మీ ఇంట్లో ఆడవాళ్లకే పరువుంటుందా? - మాజీ మంత్రి పేర్ని నాని
Perni Nani On TDP : జగనాసుర రక్తచరిత్ర పేరుతో టీడీపీ పుస్తకాన్ని రిలీజ్ చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రంగా హత్య, ఎన్టీఆర్ మరణంపై విచారణ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది
Perni Nani On TDP : టీడీపీ నేతలు సీఎంపై నీచమైన రాతలతో పుస్తకం విడుదల చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. టీడీపీ డ్రామాలు చూడలేక చస్తున్నామని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఏదో అంతర్జాతీయ పార్టీ అయినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్రలేదని విమర్శించారు. చంద్రబాబు ఒక పిరికి పందని, పుస్తకం మీద పేరు వేసుకోవడానికి కూడా చంద్రబాబుకు భయం పట్టుకుందని నాని వ్యాఖ్యానించారు. మీరు రాసింది కరెక్టే అయితే పేరు ఎందుకు వేసుకోలేకపోయారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి పై విషం చల్లడానికే ఇలాంటి తప్పుడు రాతలు రాయిస్తున్నారని నాని విమర్శించారు.
టీడీపీ హయాంలోనే వివేకా హత్య
వివేకా హత్య సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందన్న విసయాన్ని మర్చిపోయారా అని పేర్ని నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే అయినప్పటికీ వివేకా కుటుంబ సభ్యులను ఎందుకు విచారించలేదని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు వాళ్లపని వాళ్లు చేయాల్సి ఉందని, అలాంటప్పుడు చంద్రబాబు, డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు ఏం చేశారని నాని ప్రశ్నించారు.. అప్పుడెందుకు వివేకా కుమార్తె వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలన్నారు. అప్పుడెందుకు జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు చేర్చలేదో, శవపంచనామాలో వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదో ముందు సమాధానం ఇవ్వాలన్నారు. కేస్ డైరీలో ఎందుకు అవినాష్ రెడ్డి పేరు చేర్చలేదని, మార్చిలో హత్య జరిగితే 2019 మేలోపు ఎందుకు దర్యాప్తు చేయలేదని నాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తప్పుడు రాతల్లో రాసిన పేర్లు అప్పుడెందుకు ఛార్జి షీట్ లో చేర్చలేదో వెల్లడించాల్సింది తెలుగుదేశం నేతలేనని అన్నారు.
ఎన్టీఆర్ మరణంపై
ఎన్టీఆర్ మరణంపై హరికృష్ణ సీబీఐ విచారణ చేయించాలని అప్పట్లో డిమాండ్ చేశారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉండి సీబీసీఐడీ ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదని నాని అన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కోరిన విధంగా ఎందుకు విచారణ జరిపించలేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ ఎందుకు చనిపోయాడో పుస్తకం వేయాలని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. సీబీఐకి అవినాష్ ఇచ్చిన స్టేట్ మెంట్ మీకెలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఉద్ధేశపూర్వకంగా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తుందని అనుకోవాల్సి వస్తోందని నాని అన్నారు. 2019లో కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఎందుకు పుస్తకం వేయలేదని పేర్ని నాని నిలదీశారు. కోడెల సెల్ ఫోన్ ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదో సమాధానం ఇవ్వాలన్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని జీవో ఇచ్చిన చంద్రబాబు లాంటి వ్యక్తి మరొకడుండడని నాని ధ్వజమెత్తారు.
భారతి ఫొటో వేస్తారా?
అబద్దాలను ప్రచారం చేసే పుస్తకంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య ఫొటో వేయడానికి సిగ్గులేదా మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మీ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా...పరువు చంద్రబాబు సతీమణికేనా అని నాని నిలదీశారు. యూట్యూబ్ వీడియోను పట్టుకుని నీ భార్యను కూడా రాజకీయాలకు వాడుకున్నావ్ అని చంద్రబాబుపై మండిపడ్డారు. లోకేశ్ అందరినీ ఏరా, ఒరేయ్ అంటున్నాడని, ఇదేనా చంద్రబాబు పెంపకమని నాని వ్యాఖ్యానించారు.
రంగా హత్య టీడీపీనే చేసింది
జగనాసుర రక్త చరిత్ర...అంటూ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రకటనలు చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయాల కోసం టీడీపీ కావాలనే ఇష్టానుసారంగా విమర్శలు చేయటంపై వైసీపీ మండిపడుతుంది. టీడీపీ ఎలాంటి పుస్తకాలు వేసినా నష్టం లేదని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. టీడీపీ వేసే పుస్తకాలపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీదే నేరచరిత్రని ఫైర్ అయ్యారు. వంగవీటి మోహన రంగ హత్యలో ఉన్నది టీడీపీనేనని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఉనికి కోసమే ముందస్తు అంటున్నారని, లోకేశ్ యాత్రపై అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడిన విషయాలు చాలని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్ర ఎలా జరుగుతుందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.