TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట, సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే!
TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జైలు శిక్ష విధించిన సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది.
TTD EO Dharma Reddy : టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కార కేసులో ఈవో ధర్మారెడ్డికి సింగిల్ బెంచ్ నెల రోజుల జైలు శిక్ష విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈవో ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం జైలు శిక్ష ఆదేశాలపై స్టే విధించింది.
సింగిల్ బెంచ్ ఆదేశాలు
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు సింగిల్ బెంచ్ నెల రోజుల జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను ధర్మారెడ్డి అమలు చేయలేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై తాత్కాలిక ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇటీవల ఇచ్చింది. హైకోర్టు ధర్మారెడ్డికి జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం అదనపు జైలు శిక్ష పొడిగించాలని ఆదేశించింది. తమ తీర్పును అమలు చేయకపోవడంపై సైతం టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించింది.
అసలేం ఏం జరిగింది?
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా స్వర్వీసులను క్రమబద్ధీకరించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లా నాయక్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును టీటీడీ అమలు చేయలేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించింది. దీంతో ఈవో ధర్మారెడ్డికి ఊరట లభించింది.
ఈవోగా ఎన్నికైనప్పుడు!
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. టీటీడీ ఈవోగా నియమించాలంటే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవి చేసినా సరిపోతుందని హైకోర్టు నిర్ధారించింది. ఏవీ ధర్మారెడ్డి అర్హతల్లో జిల్లా కలెక్టర్ కు సమానమైన పదవిలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషన్‌ను కొట్టేసింది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.