Nara Lokesh On Anna Canteen : ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహిస్తాం, తెనాలి ఘటనపై లోకేశ్ ఫైర్
Nara Lokesh On Anna Canteen : తెనాలిలో ఉన్న క్యాంటీన్ తొలగించడంపై టీడీపీ నేత లోకేశ్ ఫైర్ అయ్యారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ ను అడ్డుకోరని మండిపడ్డారు.
Nara Lokesh On Anna Canteen : తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అన్న క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేవలం గంట వ్యవధిలో నిర్వహించే అన్న క్యాంటీన్ తొలగించమనడం సరికాదని, అక్కడే నిర్వహిస్తామని టీడీపీ నేతలు అన్నారు. తెనాలి బస్టాండ్ సమీపంలో అన్న క్యాంటీన్ నిర్వహించవద్దని ఆర్టీసీ అధికారులు టీడీపీ నేతలను కోరారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బలవంతంగా అన్న క్యాంటీన్ తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
నారా లోకేశ్ ఫైర్
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని, పేద వాళ్ల ఆకలి తీరుస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.
తెనాలిలో ఉద్రిక్తత
తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ ప్రభుత్వం పేదలకు పట్టెడు అన్న అందించి వారి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. అన్న క్యాంటీన్ రద్దును నిరసిస్తూ తామే అన్న క్యాంటీన్లను నిర్వహిస్తామని టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. తెనాలిలో మార్కెట్ సెంటర్లో ఈనెల 12వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. రద్దీ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా అన్న క్యాంటీన్ ఉందని తొలగించాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్న క్యాంటీన్ ను అక్కడే కొనసాగిస్తామని టీడీపీ నేతలు అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు అన్న క్యాంటీన్ తొలగించడంతో తెనాలిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంటీన్ తొలగించిన ప్రాంతంలోనే పేదలకు ఆహారం అందించేందుకు సిద్ధం అయ్యారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఆహార పదార్థాలను వ్యానులో తీసుకొని వస్తున్న సందర్భంలో పోలీసులు కూరల గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు.
క్యాంటీన్ తొలగించినా ఈ కార్యక్రమం ఆగదు
అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. పోలీసులపైకి టీడీపీ నాయకులు దూసుకెళ్లారు. అయితే పేదలకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ను తొలగించడంతో స్థానికుల నుంచి కూడా టీడీపీ శ్రేణులకు మద్దతు లభించింది. పోలీసులు మార్కెట్ వైపు వచ్చే అన్ని రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. గంటసేపు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసినా, అన్న క్యాంటీన్ ను తొలగించినా పేదలకు అన్నంపెట్టే కార్యక్రమం ఆగదని టీడీపీ నాయకులు తెలియజేశారు. ప్రస్తుతం తెనాలి మార్కెట్ సెంటర్ లో పరిస్థితి శాంతియుతంగా ఉన్నా ఎప్పుడు ఏమి జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : Tenali Anna Canteen : తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !