AP Ministers On Chandrababu : చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, దేవుడు తథాస్తు అంటాడు- మంత్రులు బొత్స, సీదిరి
AP Ministers On Chandrababu : చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు ఏపీ మంత్రులు. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు.
AP Ministers On Chandrababu : వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు స్పందించారు. చంద్రబాబుకు ఇవే చివరికి ఎన్నికలు తథాస్తు అదే జరుగుతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరవు కాటకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట మాట్లాడతారని చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబును హిట్లర్ తో, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారన్నారు. మరోమారు చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని స్పష్టం చేశారు.
"మహిళలను కించపరుస్తూ మాట్లాడితే ఎవరూ హర్షించడం. ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో లబ్ది పొందుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఏం మాట్లాడినా మాకు ఆశీస్సులే. చంద్రబాబును ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన సందర్భం ఉంది. ఆయన చెప్పినట్లు ఇవే చివరి ఎన్నికలు తథాస్తు"- మంత్రి బొత్స
దిగజారుడు రాజకీయాలు
2024 ఎన్నికలు చంద్రబాబుకి చివరి ఎన్నికలే అని మంత్రి సీదిరి అప్పల రాజు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. 2024 టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు అన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు గుండెల్లో గునపం దిగడం ఖాయమన్నారు. సానుభూతి కోసం మళ్లీ భార్యను లాగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ సానుభూతి డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. భార్యను అడ్డుపెట్టుకుని ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. అనని మాటలు అనట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లం
"చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉంటే ఆయన సామాజిక వర్గం తప్ప ఎవరైనా బాగుపడ్డారా? ఆయన సీఎంగా ఉంటే ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఏం చేశావ్. కర్నూల్ లో హైకోర్టుకు చంద్రబాబు వ్యతిరేకం కాదని చెప్పగలరా? సీఎం జగన్ వెంట్రుక కూడా చంద్రబాబు పీకలేరు. చంద్రబాబు పుట్టుకే 420.. చేసే పనులన్నీ 420 పనులే. నాకు చివరి ఎన్నికలు అని బీజేపీకి అస్త్రం ఇచ్చారు. ఏపీలో బలోపేతం అవ్వడానికి బీజేపీ కాచుకుని కూర్చుంది. చంద్రబాబు తప్పుకుంటే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. బహుశా మొన్న పవన్ తో మోదీ ఇదే చెప్పి ఉంటారు. షెడ్యుల్ ప్రకారమే మేము ఎన్నికలకు వెళ్తాం. 16 నెలల్లో ఎన్నికలు అని రెండు రోజుల క్రితమే సీఎం జగన్ చెప్పారు."- మంత్రి సీదిరి అప్పలరాజు
చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. దీంతో చంద్రబాబు సభకు వచ్చిన వారంతా అవాక్కయ్యారు. క్షేత్రస్థాయిలో తేల్చుకోనే అసెంబ్లీకి వెళ్తానని చంద్రబాబు చెప్పడంతో కార్యకర్తలు, నాయకులు షాకయ్యారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో విద్యార్థులతో మమేకమైన చంద్రబాబు గతంలో తమ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ భృతి సాఫ్ట్ వేర్ వంటి రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేవని.. జాబు కావాలంటే బాబు రావాలి అని పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత బాబుకు తమ సమస్యలను వేడుకున్నారు. బాబు విద్యార్థులకు దీటుగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తామని రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు హామీనిచ్చారు.