Minister Vidadala Rajini : రాష్ట్రంలో 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి - మంత్రి విడదల రజిని
Minister Vidadala Rajini : రాష్ట్రంలో 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి విడదల రజిని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు హెల్త్ క్లినిక్ లు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు.
Minister Vidadala Rajini : వైద్య ఆరోగ్య రంగంలో సంచలన మార్పులు దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సచివాలయంలో గురువారం మంత్రి విడదల రజిని వైద్య సేవలు, వసతుల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా, సులువుగా అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా సరే వైద్య ఆరోగ్య శాఖకు అందజేస్తూ పూర్తిగా అండగా ఉంటున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను తీసుకొచ్చారని తెలిపారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు
రాష్ట్రంలో 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి విడదల రజిని చెప్పారు. 528 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, 1125 పీహెచ్‌సీలు, 168 ఏపీవీవీపీ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, పలాసలో కిడ్నీ రీసెర్చి సెంటర్, 16 మెడికల్ కళాశాలల నిర్మాణం, 13 మెడికల్ కళాశాలల ఆధునికీకరణ, ఐదు చోట్ల ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మొత్తం రూ.16,252 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. వీటిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాల్సి ఉందని, ఆ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
492 ఔషధాల కొనుగోలుకు ధరపై ఒప్పందం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఔషధ నిల్వల కేంద్రాలను పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. అన్ని సెంట్రల్ మెడికల్ స్టోర్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని కేంద్రాలకు అదనంగా డీఈవో, మరో ఇద్దరు ప్యాకర్లను నియమిస్తున్నామన్నారు. సీఎంఎస్‌లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా డ్రస్ కోడ్ అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 492 ఔషధాల కొనుగోలుకు ధర ఒప్పందం కుదుర్చుకుందని, తెలంగాణ 378, తమిళనాడు 348, బీహార్ 253 రకాల ఔషధాలకు మాత్రమే కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయని వివరించారు.
ఆస్పత్రులకు ఆధునిక పరికరాలు
విశాఖపట్టణంలోని కేజీహెచ్‌కు సిటీ, ఎమ్మారై యంత్రాలను త్వరలోనే అందజేస్తామని మంత్రి రజిని తెలిపారు. జీజీహెచ్ కాకినాడ, జీజీహెచ్ కర్నూలుకు క్యాత్‌ల్యాబ్‌ను కూడా అతి త్వరలోనే సమకూరుస్తామన్నారు. కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రత్యేకంగా పరికరాలు అందుబాటులో ఉంచేందుకు రూ.130 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. యూపీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఈ ఏడాది చివరికల్లా సేవలు అందజేయబోతున్నామని, ఆయా ఆస్పత్రులకు రూ.220 కోట్లతో ప్రత్యేకంగా పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. కర్నూలులోని జీజీహెచ్‌లో క్యాన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధికి రూ.90 కోట్ల విలువైన పరికరాలను అందజేయబోతున్నామని మంత్రి చెప్పారు.
మందుల కొరత లేకుండా
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి విడదల రజిని స్పష్టంచేశారు. ఇప్పటి నుంచే టెండర్లు పిలిచి మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. టెండర్ల విషయంలో ఎక్కడా విమర్శలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవినీతి, అక్రమాలు లేని స్వచ్ఛమైన పాలనే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు.