Janasena Sabha : మూడేళ్లుగా రాజధాని లేకుండా పాలన చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది : నాగబాబు
Janasena Sabha : జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని విమర్శించారు.
Janasena Sabha : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ(Janasena Party) తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో జనసేన పార్టీ నాయకుడు, నటుడు నాగబాబు పాల్గొన్నారు. ఈ సభలో మట్లాడిన ఆయన ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. వైసీపీ(Ysrcp) నేతలు ఇబ్బందులు పెట్టినా సభ కోసం పొలాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సభాస్థలి ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెట్టిందని నాగబాబు(Nagababu) ఆరోపించారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తును దోచుకుంటారని విమర్శలు చేశారు. రాజకీయ దొంగలను కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారన్నారు. మూడేళ్లు రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాజధాని కోసం రైతులు అకుంఠిత దీక్ష చేశారని నాగబాబు అన్నారు.
దుర్మార్గ సీఎం
రాష్ట్ర రాజధాని కోసం జనసేన పోరాటం చేసిందని నాగబాబు అన్నారు. రాజధానిపై కోర్టు(High Court) తీర్పులను సీఎం జగన్(CM Jagan) శిరసావహించాలని సూచించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కాందిశీకులుగా పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. జగన్ పాలనలో కొద్ది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలేని పదవులు ఇస్తే నాయకులు అల్లాడిపోతున్నారన్నారు. ఏపీకి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై రూ.లక్షకు పైగా అప్పులు ఉన్నాయన్నారు. మళ్లీ పన్నుల రూపంలో మనమే కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. "నేను మంచి సీఎంను చూశా చెడ్డ సీఎంను చూశాను. కానీ దుర్మార్గ సీఎంగా జగన్ ను చూస్తున్నాను" అని నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో సీఎం, ఆయన సలహాదారులు తప్ప ఇంకెవ్వరూ బాగుపడలేదని విమర్శించారు. మంత్రులు సైతం అసహనంగా ఉన్నారన్నారు. చేయడానికి పనిలేక కొందరు మంత్రులు ఫోన్లలో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించారు. తనకు సోదరుడే అయినప్పటికీ పార్టీ పరంగా పవనే తన నాయకుడని నాగబాబు చెప్పారు.
వైసీపీ విలువల్లేని రాజకీయాలు చేస్తుంది : నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలకు గురయ్యారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. పవన్‌ను ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన దామోదరం సంజీవయ్య ఎంతో ఎత్తుకు ఎదిగారని, కానీ ఆయనకు సరైన గుర్తింపు ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసిన అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం కోసమే ఈ సభకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టామన్నారు. అమరావతిని నాశనం చేయడానికి జగన్ పూనుకున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఒకప్పుడు రూ.8 కోట్లు పలికిన భూముల ధర ఇప్పుడు రూ.3 కోట్లకు పడిపోయిందన్నారు. సంక్షేమం పేరుతో విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికలకు జనసైనికులు సన్నద్ధం అవ్వాలని సూచించారు.