Perni Nani On Chandrababu : చంద్రబాబు విజయ రహస్యం కొనడం, అమ్మడం- పేర్ని నాని సెటైర్లు
Perni Nani On Chandrababu : చంద్రబాబు అంటేనే నయవంచన, నమ్మకద్రోహం, వెన్నుపోటు రాజకీయాలని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
Perni Nani On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు విజయ రహస్యం కొనటం, అమ్మడమే అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే నమ్మకద్రోహం, వెన్నుపోటు, నయవంచన అని విమర్శించారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ కన్నా జగన్ ఎక్కువ జనాదరణ
"వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు సభ్యులు, టీడీపీ సభ్యులు వాళ్లు పునీతులుగా మాట్లాడుతున్నారు. వాళ్లు రాజకీయాల్లో ఎటువంటి తప్పుడు పనులు చేయనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు.. నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినా అన్యాయంగా అరెస్టు చేశారని కబుర్లు చెబుతున్నారు. అసలు చంద్రబాబు విజయ రహస్యం కొనడం, అమ్మడం. నయవంచన, నమ్మకద్రోహం, నటించడం, వెన్నుపోటు పొడవటం ఇదే చంద్రబాబు లక్ష్యం. జగన్ లక్షణాలు నమ్మకం, మనసులో ఏముంటే అది చెప్పటం, అది చేడు నిజమైనా ముఖంపై చెప్పడం, చేసేదే చెప్పడం. అందుకే జగన్ అంటే ప్రజలకు అపార నమ్మకం. 1983లో ఎన్టీఆర్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు... ఇందిరాగాంధీ ఆదేశిస్తే గుడివాడలో ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పలేదా? 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో చంద్రబాబు ఓ చిన్న కార్యకర్తపై ఓడిపోయారు. ఆ తర్వాత తన భార్యను ఎన్టీఆర్ వద్దకు పంపి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ వద్ద నక్క వినయాలు చేసి, సమయం కోసం ఎదురు చూసి వెన్నుపోటు పొడిచారు. 1995లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాదా ప్రభుత్వాన్ని కూలదూసింది. కాంగ్రెస్ పార్టీతో జగన్ కు పడలేదు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్తుంటే కాంగ్రెస్ అడ్డుకుంటే జగన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన తల్లితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా ఎక్కువ జనాదరణ కల్గిన నేతగా జగన్ ఎదిగారు." - పేర్ని నాని
టికెట్ దక్కదని నమ్మకద్రోహం
"23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసింది వాస్తవం కాదా? ఇది చంద్రబాబు చరిత్ర. 2014లో బీజేపీ, జనసేన మద్దతు చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాడు. చంద్రబాబు చరిత్ర అంటూ కొనుగోలు రాజకీయం. ఏమార్చి రాజకీయాల్లో గట్టెక్కడమే చేశారు. తాడికొండలో కొత్త అభ్యర్థి ఛాన్స్ ఇద్దామని ఉండవల్లి శ్రీదేవిని అప్పట్లో టికెట్ ఇచ్చారు. ప్రజల్లో మీరు బలహీనపడ్డారు అని పార్టీ అధ్యక్షులు శ్రీదేవికి చెప్పారు. ఈసారి టికెట్ వేరొకరికి ఇస్తామని చెప్పగానే స్వార్థ రాజకీయానికి పాల్పడ్డారు. చాలా పెద్ద కుటుంబాల నుంచి వచ్చినవాళ్లకే టికెట్ ఇవ్వలేమని చెప్పారు. పార్టీని నమ్ముకుని ఉంటే మంచి అవకాశం ఇస్తామన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారు. ఆమె అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారు. శ్రీదేవికి తాడికొండ నియోజకవర్గంలో ఆదరణ తగ్గింది. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు.. నేరుగా శ్రీదేవికి చెప్పారు. టికెట్ దక్కదని భావించి వైసీపీకి నమ్మకద్రోహం చేశారు."- పేర్ని నాని