Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Perni Nani : మంత్రి వర్గం విస్తరణపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. మరోసారి మంత్రి వర్గం విస్తరణ జరిగే అవకాశం లేదని, ఇప్పుడున్న కేబినెట్ తోనే ఎన్నికలకు వెళుతున్నామని ఆయన అన్నారు.
Perni Nani : పార్టీకి చెందిన శాసన సభ్యులు, ఇన్ ఛార్జ్ లతో సీఎం జగన్ భేటీ అవుతున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. మంత్రి వర్గ మార్పులపై ఎటువంటి ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు. ఇప్పుడున్న కేబినెట్ తోనే ఎన్నికలకు వెళుతున్నామని ఆయన తెలిపారు.
చంద్రబాబు అన్ని సీట్లలో పోటీ చేస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబు 175 సీట్లలో పోటీ చేస్తారా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 175 సీట్లలో అసలు సైకిల్ గుర్తు ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయని, టీడీపీకి అభ్యర్థులే దిక్కులేరన్నారు. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు ఎన్ని సీట్లిస్తున్నారో, బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకి ఎన్నిస్తున్నారో చంద్రబాబు సమాధానం ఇవ్వాలన్నారు. కేవలం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకే ఎవరెస్ట్ ఎక్కినంత హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వై నాట్ పులివెందుల అంటున్న చంద్రబాబుకు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ పోటీ చేసినా మాకు ఓకే అని ఆయన అన్నారు.
అప్పులన్నీ చంద్రబాబు ఖాతాలోనే
రాష్ట్రంలో అప్పులన్నీ చేసిన చంద్రబాబు ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, మేం వచ్చిన తర్వాత తెచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉందని నాని అన్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు లెక్కేదని, ఆ పాపాలే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మోస్తున్నారని తెలిపారు. జగన్ ని అసభ్యంగా, వ్యక్తిగతంగా, నీచంగా దుర్భాషలాడించడం చంద్రబాబు నైజమని పేర్ని నాని ఫైర్ అయ్యారు. మందడంలో అమరావతి ఉద్యమం టెంట్ ఖాళీగానే ఉంటుందని, ఫ్యాన్సీ నంబర్ వచ్చినప్పుడు మాత్రం సందడి చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అక్కడికి అద్దె మైక్‌గాళ్లు వచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, అమరావతి పేరుతో జరిగిన సభలో జగన్ పై కారుకూతలు కూయడం ధర్మమా అని ప్రశ్నించారు.
బీజేపీ నేతలపై మండిపాటు
మందడం ఘటనలో అసలు బీజేపీ వారు ఉన్నారా అని పేర్ని నాని అన్నారు. వారంతా పది దొడ్లు మారి వచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కర్నూలు డిక్లరేషన్, గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని అన్నారు. కర్నూల్ డిక్లరేషన్‌లో బీజేపీ కోరిందేమిటి? ఈరోజు ఆ పార్టీ చేస్తున్నదేంటని నాని వ్యాఖ్యానించారు.ఏపీ రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని, కర్నూలు డిక్లరేషన్ లో మొదటి డిమాండ్‌గా పెట్టారని గుర్తు చేశారు. వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలన్నారు. కర్నూలులో అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకోసారి కర్నాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ కోరలేదా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్, తదితర శాఖల భవనాలు ఏర్పాటు చేయాలని, సీఎం నివాస భవనం కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించారని చెప్పారు. ఇప్పడు మాట మార్చిన బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి జగన్ ప్రభుత్వాన్ని కావాలనే విమర్శిస్తున్నారని నాని ఫైర్ అయ్యారు.