CM Jagan : ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు, సచివాలయానికి రూ.20 లక్షలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకు రూ. 2కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
CM Jagan : గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైసీపీ రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఎమ్మెల్యేకు నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు నిధులు విడుదల చేస్తారని సీఎం ప్రకటించారు. తాను చేయాల్సింది చేస్తున్నానని, ఇక బాధ్యత అంతా మీదే అన్నారు. చేసిన పని చెప్పుకుని సానుకూలత తీసుకురాకపోతే ఎవరూ క్షమించరని పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్ సున్నితంగా హెచ్చరించారు.
టార్గెట్ 175
సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయన్నారు. మళ్లీ అధికారం చేపట్టాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. వారి మద్దతు ఉంటే 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని సీఎం జగన్ అన్నారు.
ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు
రాష్ట్రంలోని ప్రతీ సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వినతులను తీసుకుని ప్రాధాన్యతా ప్రకారం డబ్బు ఖర్చు చేయాలన్నారు. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ జీవో విడుదల చేసినట్లు తెలిపారు. సీఎం అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. సచివాలయాలకు ఇచ్చే నిధులకు ఇది అదనమని వెల్లడించారు. గడప, గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చే నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్నారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు, లేదా గరిష్టంగా 21 రోజులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశించారు.
Also Read : Somu Veerraju : మంత్రి పదవి ఎలా సంపాదించారో తెలుసు, కొట్టు సత్యనారాయణపై సోము వీర్రాజు ఫైర్
Also Read : YS Jagan On Opposition : రాష్ట్రం పరువు తీస్తున్నారు - విపక్షాలపై జగన్ విమర్శలు !