Somu Veerraju : మంత్రి పదవి ఎలా సంపాదించారో తెలుసు, కొట్టు సత్యనారాయణపై సోము వీర్రాజు ఫైర్
Somu Veerraju : దేవాదాయశాఖపై అవగాహన లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని కొట్టు సత్యనారాయణపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. మంత్రి పదవి ఎలా వచ్చిందో బీజేపీ, పవన్ కల్యాణ్ కు తెలుసన్నారు.
Somu Veerraju : వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడారు. వరదల కారణంగా లంక గ్రామాల్లో పెద్దఎత్తున నష్టం జరిగిందన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బాధితులు తిరగబడినా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదన్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, నీట మునిగిన వందల గ్రామాల ప్రజలకు కనీసం తాగునీటిని కూడా ఇవ్వలేకపోయారన్నారు. సీఎం మాటలన్నీ నీటి మూటల్లా మారిపోయాయని, పోలవరం ప్రాంతాల్లోని ముంపు మండలాల్లో భయానకమైన వాతావరణం ఉందన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్థమైందన్నారు.
మంత్రికి సవాల్
ముంపు మండలాల్లోని ప్రజలకు పరిహారం వెంటనే ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో బీజేపీ బృందం పర్యటిస్తుందని, వరద బాధితులకు సాయం అందిస్తుందన్నారు. హిందూ దేవాలయాల నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని, తన శాఖ గురించి సరైన అవగాహన లేని వ్యక్తి దేవాదాయశాఖామంత్రి అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి పదవికి కొట్టు సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు మారే కొట్టు సత్యనారాయణకు బీజేపీ, పవన్ కల్యాణ్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రభుత్వ నిధులను చర్చిల నిర్మాణానికి మళ్లిస్తున్నారని, దేవాదాయ శాఖ మంత్రికి దమ్ముంటే చర్చిలకు ఇచ్చే నిధులను ఆపగలరా అని సోమువీర్రాజు సవాల్ విసిరారు. రోడ్లు వేయలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని, కేంద్రం నిధులతో ఏపీలో రోడ్లు వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని దుస్థితిలో ఉందన్నారు.
మంత్రి పదవి ఎలా వచ్చిందో తెలుసు
దేవుడిని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. రెండు లక్షల రూపాయలు ఆదాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను విస్మరించి దేవాలయాలపై ఆధిపత్యం చేస్తుందని విమర్శించారు. పుష్కరాల సమయంలో టీడీపీ దేవాలయాలను పడగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు కొట్టు సత్యనారాయణ మాతో కలిసి దేవాలయాల సంరక్షణకు పోరాడారన్నారు. అయితే సరైనా అవగాహన లేని దేవాదాయ శాఖ మంత్రి ఒక్క రూపాయి కూడా దేవాలయాల్లో అవినీతి జరగలేదని సవాల్ విసురుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు మంత్రి దేవాలయాలకు కాపల ఉన్నారంటే మేము నమ్మె పరిస్ధితిలో లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గురించి ఏం తెలుసని కొట్టు సత్యనారాయణ విమర్శిస్తున్నారని, దేవదాయ శాఖ మంత్రిగా పదవి ఎలా సంపాదించుకున్నారో బీజేపీకి పవన్ కల్యాణ్ కు తెలుసు అనే విషయం మంత్రి గుర్తు చేసుకోవాలని చెప్పారు.