CM Jagan Review : సీఎం జగన్ కీలక నిర్ణయం, అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
CM Jagan Review : అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
![CM Jagan Review : సీఎం జగన్ కీలక నిర్ణయం, అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Amaravati CM Jagan review on Anganwadi centers ordered recruitment in vacant posts DNN CM Jagan Review : సీఎం జగన్ కీలక నిర్ణయం, అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/15/9a81336cdf593c6c890c7db0f73b73591671108223208235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Review : అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తి చేయాలని ఆదేశించారు.
మహిళా శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష
మహిళా శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అంగన్‌వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టు నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టలన్నారు. సీడీపీఓ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. వాటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, పిల్లలు వికాసం చెందేలా మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు.
సార్టెక్స్ రైస్ సరఫరా
అంగన్‌వాడీలలో సార్టెక్స్ రైస్ సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీపడొద్దని సూచించారు. పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ నాణ్యత కచ్చితంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. అంగన్‌వాడీలలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో అన్నింటా నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, అందుకోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలన్నారు. అంగన్‌వాడీల్లో కరికులమ్ కూడా మారాలని, పిల్లలకు చిన్న వయసులోనే మెదడు తొందరగా పరిణతి చెందుతుంది కాబట్టి, ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారని అన్నారు. కరికులమ్ మార్పు కోసం అవసరం అయితే ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్న సీఎం, తనిఖీలు, నాణ్యత, నాడు-నేడు ఈ మూడు అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలన్నారు. అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ చెప్పారు.
భాషపై గట్టి పునాది
సిబ్బంది నియామకాలు సహా ఏ రకమైన అవసరం ఉన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. ఆ మేరకు కచ్చితమైన ఫలితాలు కూడా రావాల్సిందేనన్నారు. సూపర్‌వైజర్స్ సక్రమంగా పని చేయాలని, వారి పనితీరు పై పర్యవేక్షణ ఉండాలన్నారు. సూపర్ వైజర్స్ వ్యవస్థ ద్వారా అంగన్‌వాడీలలో పనితీరు మెరుగవడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది వేయాలన్నారు. మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పలువురు అధికారులు సమీక్షకు హాజరయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)