Mandous Cyclone : ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు, తుపాను బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
Mandous Cyclone :మాండూస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
Mandous Cyclone : మాండూస్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. తుపాను బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైనా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించాలని తెలిపింది. ఏపీలోని ఆరు జిల్లాలపై మాండూస్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో పలు కాలనీలు ముంపు
మాండూస్ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పుంగనూరు మండలం లక్ష్మీపురం కాలనీ జలదిగ్భందమై కాలనీవాసులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాండూస్ తుపాను ప్రభావంతో చుట్టుపక్కల చెరువులన్నీ పూర్తిగా నిండి పొంగి పొర్లతుండడంతో లక్ష్మీపురం కాలనీవాసులకు వరద నీరు చేరుకున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. ముంపు ఉన్న ప్రదేశాలలోని ఇండ్లలను ఖాళీ చేయించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. తహసీల్దార్ సీతారామన్ మాట్లాడుతూ... బోడి నాయన పల్లి చెరువు నీటి ప్రవాహం అధికం కావడంతో కాలనీలో నీళ్లు ప్రవహించాయన్నారు. గతంలో కూడా కాలనీ ముంపునకు గురైందన్నారు. వర్షాలు తగ్గగానే కల్వర్టుల ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాలపై మాండూస్ ఎఫెక్ట్
మాండూస్ తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాస్త ప్రకృతి వైఫరీతాల్య నుంచి గట్టెక్కిందనుకుంటున్న క్రమంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కేవలం 30 శాతం మాత్రమే వరి పంటకు సంబంధించి కోతలు పూర్తయ్యాయి. మరో 20 శాతం చేలల్లో వరి పనలు గాను, గట్టుమీద కల్లాల్లో రాసులుగా చాలా వరకు పంట ఉండిపోయింది. ఇక 50 శాతం వరకు కోతలు ఇంకా ప్రారంభించనేలేదు. కోతలు ప్రారంభించని రైతులు వరకు పరవాలేదుకానీ కల్లాల్లోను, చేలల్లోనూ ఉండిపోయిన పంటకు సంబంధించి రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొంత వరకు ఒబ్బిడి చేసుకున్న ధాన్యాన్ని బరకాల సాయంతో కప్పిఉంచి వర్షాల నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు రైతులు. అయితే చేలల్లో పనల రూపంలో ఉండిపోయిన పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.