Minister Roja News: మంత్రి రోజాకు పెరుగుతున్న అలనాటి తారల మద్దతు - తాజాగా మీనా, రమ్యక్రిష్ణ కూడా
ఇప్పటికే నటి ఖుష్బు, రాధిక శరత్ కుమార్, రమ్యక్రిష్ణ స్పందించగా తాజాగా మరో నటి మీనా కూడా స్పందించారు.
ఏపీ మంత్రి రోజాకు అలనాటి తారల నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. టీడీపీ నేత ఆమెను అభ్యంతరకర రీతిలో దూషించిన విషయంలో ఇప్పటికే నటి ఖుష్బు, రాధిక శరత్ కుమార్, రమ్యక్రిష్ణ స్పందించగా తాజాగా మరో నటి మీనా కూడా స్పందించారు. మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మీనా తీవ్రంగా తప్పుబట్టారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
తాజాగా నటి మీనా ఓ వీడియోలో విడుదల చేశారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ నీచమైన వ్యాఖ్యలు చేశారని.. అవి ఆమోదయోగ్యం కాదని అన్నారు. బండారు సత్యనారాయణ వెంటనే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దిగజారుడు మనస్తత్వం కలవారని ఈ వ్యాఖ్యలతో అర్థం అయిందని అన్నారు. అతని అభద్రత భావం, అసూయకి ఇవి నిదర్శనమని అన్నారు.
నటిగా, తల్లిగా, పొలిటికల్ లీడర్‌గా, మహిళగా నిజ జీవితంలో అన్ని పాత్రల్లోనూ రోజా సక్సెస్ అయ్యారని మీనా అన్నారు. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడబోరని, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నారా అని అన్నారు? మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని మీనా మద్దతు పలికారు. మంత్రి రోజా తన సహ నటి అని, ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనకు తెలుసని గుర్తు చేశారు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి తనకు పూర్తిగా తెలుసని అన్నారు. రోజా చాలా చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆమె మనస్సు కూడా దృఢంగా ఉంటుందని అన్నారు.
రమ్యక్రిష్ణ కూడా..
బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల పట్ల మరో సినీ నటి రమ్యకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని అన్నారు. బండారు సత్యనారాయణని క్షమించకూడదని అన్నారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశం ప్రపంచంలోనే ఐదో అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని అన్నారు. అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తాను సాటి మహిళగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని అన్నారు. బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని రమ్యకృష్ణ తెలిపారు. ఈ దేశంలో మహిళలపై రేప్‌లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణలు ఇప్పటికీ కొనసాగడం సమంజసం కాదని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.