3 Years of YSRCP Rule: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు సాధ్యమా ? నిజంగానే క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ ఉందా !
3 Years of YSR Congress Party Rule: ఇటీవల వైసీఎల్పీ సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అందరూ కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు అసాధ్యం కాదని చెప్పారు.
3 Years of YSR Congress Party Rule: ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. అధికార పార్టీగా టీడీపీ 2019 ఎన్నికల్లో బరిలో దిగింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష పార్టీ హోదాలో పోరు సాగించింది. అప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయారు. ఒకరకంగా అప్పటికే టీడీపీ బలంగా కనిపించింది. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే.. నవ్యాంధ్రకు మరోసారి చంద్రబాబు సీఎంగా వచ్చేస్తారని తేల్చిపారేసింది. అలాంటి సమయంలో వైఎస్ జగన్ పార్టీ వైసీపీ 151 స్థానాలు నెగ్గి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికార టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితం అయింది. ఒకరకంగా ఇది జగన్ కూడా ఊహించని భారీ విజయం. చంద్రబాబు షాకయ్యే పరిణామం. 2019లో అదే జరిగింది. మరి 2024లో ఏం జరగబోతోంది. వైసీపీ బలం పెరుగుతుందా, లేక టీడీపీ పట్టు నిలుపుకుంటుందా..?
జగన్ టార్గెట్ 175 స్థానాలు..
ఇటీవల వైసీఎల్పీ సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలని ఉపదేశమిచ్చారు. అందరూ కష్టపడితే అదేమీ అసాధ్యం కాదని చెప్పారు. తన దగ్గర సర్వే రిపోర్టులు ఉన్నాయని, కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని అలాంటివారు ప్రజల్లోకి వెళ్లాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, అప్పుడే వారికి భరోసా ఇచ్చినట్టవుతుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని చెప్పారు జగన్.
జగన్ ధైర్యమేంటి..?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటింగ్ శాతం 49.95 అదే సమయంలో టీడీపీకి 39.26 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీట్ల విషయంలో మాత్రం చాలా తేడా వచ్చేసింది. అంటే ఓట్ల శాతానికి, సీట్లకు ఏమాత్రం పొంతన లేదని తేలిపోయింది. ఆ మాటకొస్తే 2014 ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో వైసీపీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. జగన్ ధీమా ఒక్కటే. ప్రతిపక్ష హోదాలోనే 50శాతం ఓట్లను గెల్చుకున్న వైసీపీ, ఇప్పుడు అధికార పార్టీగా, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఇంకెంత ఓట్లు సాధించాలి. ఆ లెక్క నిజమైతే.. టీడీపీకి కనీసం ఒక్క సీటయినా దక్కుతుందా అని జగన్ ఆలోచిస్తున్నారు.
చంద్రబాబు కూడా ఓడిపోవాల్సిందేనా..?
అసెంబ్లీ ఎన్నికల విజయంతోపాటు.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు వైసీపీకి మరింత నమ్మకాన్ని పెంచాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎంపీపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా వైసీపీ స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాల్సిందేననేది జగన్ ఆలోచన, ఆశ. అందుకే ఆయన 175 స్థానాల్లో గెలిచి తీరుతామంటూ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు.
క్లీన్ స్వీప్ సాధ్యమేనా..?
పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాల్టీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ సాధించడం సాధ్యమేమో కానీ, 175 సీట్లున్న అసెంబ్లీలో అన్ని స్థానాలు ఒకే పార్టీకి రావడం మాత్రం అసాధ్యం. అయితే జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారనుకోవడం పొరపాటే. టార్గెట్ 175 ఫిక్స్ చేసుకుంటే.. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఈసారి మరిన్ని ఎక్కువ తెచ్చుకోవచ్చు. అదే జగన్ తన టార్గెట్ ని తగ్గించుకుంటే ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకునే అవకాశముంది. అందుకే జగన్ తన టార్గెట్ 175గా ఫిక్స్ చేశారు. ఆ దిశగా నేతలంతా పనిచేయాలని ఆదేశించారు.
Also Read: 3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?
Also Read: 3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !