PKL 2021: కూత మొదలయ్యేది అప్పుడే.. ప్రొ కబడ్డీ సీజన్ 8 ప్రారంభ తేదీ ఖరారు
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతున్న ప్రొ కబడ్డీ సీజన్ మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ 22న బెంగుళూరు వేదికగా పీకేఎల్ సీజన్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా ప్రేక్షకులు లేకుండా బయోబబుల్ లో ఈ సీజన్ ను నిర్వహించనున్నట్లు పీకేఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 12 జట్లు తలపడుతుండగా...మ్యాచ్ లు అన్నీ బెంగుళూరులోని జరగనున్నాయి. కర్ణాటకలో లీగ్ మొత్తం నిర్వహించటాన్ని గౌరవంగా భావిస్తున్నామన్న నిర్వాహకులు....ఇక్కడ ఉన్న అత్యాధునిక సదుపాయాలు, భద్రతాప్రమాణాలు, కొవిడ్ నిబంధనలతో తమ సీజన్ సజావుగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరిసారిగా 2019 లో ప్రొ కబడ్డీ సీజన్ ను నిర్వహించగా....ఆ సీజన్ లో దబాంగ్ ఢిల్లీ ని ఫైనల్ లో ఓడించి బెంగాల్ వారియర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఎనిమిదో సీజన్ ఆటకు సంబంధించి ఆటగాళ్ల వేలాన్ని ఆగస్ట్ లో నిర్వహించారు.