RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియం
ఎవరికైనా సొంత మైదానం అంటే కంచుకోట లా ఉంటుంది. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్ కి చెపాక్ స్టేడియం కంచుకోట. ఈ సీజన్ లో నే ఆర్సీబీ చెన్నైని చెపాక్ లో 18 ఏళ్ల తర్వాత ఓడించింది. అంటే ఇన్నేళ్లుగా తన కోటను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బెంగుళూరు మీద కాపాడుకుంటూ వస్తున్నారు. ముంబై ఇండియన్స్ కి వాంఖడే కూడా అంతే. 10ఏళ్ల తర్వాత ముంబైని వాంఖడే లో ఈ సీజన్ లోనే ఓడించింది ఆర్సీబీ. వాళ్లు కూడా వాంఖడేలో తిరుగులేని యోధులు అన్నమాట. కానీ ఆర్సీబీ పరిస్థితే విభిన్నం. పక్క టీమ్ ల కోటలపై విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ తన సొంత గడ్డపై మాత్రం విక్టరీలు అందుకోలేకపోతోంది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన 14ఓవర్ల మ్యాచ్ లో హోం గ్రౌండ్ బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ఓటమి చవి చూసింది ఆర్సీబీ. మొదట బ్యాటింగ్ చేసి కష్టపడి 95పరుగులు చేస్తే..పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేజ్ చేసి..చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి మళ్లీ ఓటమిని గిఫ్ట్ గా అందించింది. ఈ సీజన్ ఆర్సీబీ ఇప్పటివరకూ ఏడు మ్యాచులు ఆడితే అందులో నాలుగు బెంగుళూరు బయట జరిగాయి ఆ మ్యాచుల్లో నాలుగుకు నాలుగు గెలుచుకుంది ఆర్సీబీ. కానీ హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మూడుకు మూడు మ్యాచుల్లోనూ అనూహ్యంగా ఓటమిని చవి చూసింది. మొత్తంగా ఆర్సీబీకి బెంగుళూరులో 46వ ఓటమి. ప్రతీ టీమ్ దాదాపుగా 7 మ్యాచులు సొంత మైదానంలో ఆడతాయి. అలాంటిది 46 మ్యాచులు బెంగుళూరులోనే ఓడిపోయిన ఆర్సీబీ ఓ మైదానంలో అతి ఎక్కువ సార్లు ఓడిపోయిన టీమ్ గా రికార్డుల్లోకి ఎక్కింది.





















