లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్
లెబనాన్‌పై పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమని సంచలన ప్రకటన చేసింది ఇజ్రాయేల్. ఇప్పటి వరకూ గగనతలం నుంచి దాడులు చేసింది ఇజ్రాయేల్. ఇప్పుడు ఏకంగా సైన్యంతో నేరుగా యుద్ధం చేసేందుకు సిద్ధమని తేల్చి చెప్పింది. హెజ్బుల్లాపై వార్‌కి రెడీ అయింది. ఫలితంగా మరోసారి మధ్యప్రాచ్యంలో అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో All Out War జరిగే అవకాశముందని అన్నారు. మొత్తం మిడిల్ ఈస్ట్ తగలబడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలౌట్ వార్ అంటే..రెండు దేశాలు తమ పూర్తి వార్ కెపాసిటీని ఉపయోగించి పరస్పరం దాడులు చేసుకోవడం. వారం రోజుల్లోనే ఇజ్రాయేల్ దాడుల కారణంగా లెబనాన్‌లో 600 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే..వీలైనంత వరకూ ఈ యుద్ధ వాతావరణానికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరగాలని అన్నారు బైడెన్. అమెరికా ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందని వెల్లడించారు. అయితే..ఇజ్రాయేల్ మాత్రం భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. హెజ్బుల్లా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెబుతోంది.