Ponniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP Desam
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల వేడుకల్లో చోళ చరిత్ర దశదిశలా వినిపించింది. కారణం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ తమిళ సినిమాగా పొన్నియన్ సెల్వన్ 1 జాతీయ అవార్డును కైవసం చేసుకోగా...బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు గానూ ఏ ఆర్ రెహమాన్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. చోళుల చరిత్ర ఆ గ్రాండియర్ ను కళ్లకు కట్టేలా చూపించినందుకు గానూ జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ కు, చోళ చరిత్ర జయజయధ్వానాలను ఘనంగా వినిపించిన ఆనంద్ కృష్ణమూర్తి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలోనూ జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. కల్కి కృష్ణమూర్తి చోళుల చరిత్ర ఆధారంగా రాసిన పొన్నియన్ సెల్వన్ పుస్తకాన్ని లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, జయంరవి ఇంకా అనేక మంది మేటి నటీనటులతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 1 భాగం 2022లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రత్యేకించి పుస్తకంలో కల్కి కృష్ణమూర్తిని రాసిన దానికి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా యధావిధిగా చోళుల చరిత్రను తెరపై చూపించటం తమిళ సాహిత్యానికి పెద్దపీట వేయటం వంటి విషయాలు పొన్నియన్ సెల్వన్ కు మంచిపేరు సాధించి పెట్టాయి. అందుకే 70జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ 1 నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తన సత్తా చాటింది.