Cinematograph Act : సినిమాటోగ్రఫీ యాక్ట్ 2021.. మండిపడుతోన్న తారలు!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ 2021 చట్టాన్ని సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం భావ ప్రకటనా స్వేచ్చకి విఘాతం కలిగిస్తుందని సినీ తారలు కేంద్రంపై మండిపడ్డారు. సినిమాల విడుదలకు అనుమతిస్తూ సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను కూడా పక్కనపెట్టి.. మళ్లీ రివ్యూ చేసే అధికారాలను కేంద్రానికి కట్టబెట్టే ఈ ప్రతిపాదన తమకు సమ్మతం కాదని సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు పోస్ట్ లు పెడుతున్నారు.
గతవారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును విడుదల చేసింది. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తున్నామని.. దీనిపై ప్రజా స్పందనతో పాటు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి స్పందనలను జూలై 2లోపు తెలియజేయాలని కేంద్రం గతవారం జారీ చేసిన ఓ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ చట్టానికి సవరణలు చేసిన పక్షంలో సెన్సార్ బోర్డు ఇదివరకే క్లియర్ చేసిన సినిమాలను కూడా తిరిగి సమీక్షించడానికి కేంద్రానికి అధికారాలు లభిస్తాయి.
పైరసీకి సంబంధించిన శిక్షలతో పాటు ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్ లు కూడా ఇందులో ఉన్నాయి. సర్టిఫికెట్ గండం దాటడానికి మేకర్లు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కొత్త సవరణలు సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
గతంలో ప్రముఖ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసిన సభ్యులు దానికి ఏజ్ సర్టిఫికెట్ ఇవ్వాలే తప్ప.. సినిమాను సెన్సార్ చేసే హక్కు ఉండకూడదని కమిటీ సూచించింది. కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ అభ్యంతరకరం పేరుతో దృశ్యాలను తొలంగించడం, డైలాగులను మ్యూట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇక సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రెండు ప్యానెల్ లు (ఎగ్జామైనింగ్ కమిటీ, రివైజింగ్ కమిటి) గనుక సర్టిఫికేషన్ ను నిరాకరిస్తే 'ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్' ఫిల్మ్ మేకర్లకు ఊరట ఇచ్చేది. కానీ.. ఏప్రిల్‌లో ఆ ట్రిబ్యునల్ ను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో కత్తెరల పంచాయితీపై నిర్మాతలు ఇకపై కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కలుగుతోంది.
లొసుగులు :
కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలోని లొసుగులేంటంటే.. ఇప్పటివరకు ఏమైనా చిత్రాలను తీస్తే అవి సెంట్రల్ బోర్టు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ద్వారా పరిశీలించబడి విడుదలకు సిద్ధమవుతాయి. అయితే ఈ కొత్త చట్టం ద్వారా సెన్సార్ బోర్డు పరిశీలించిన చిత్రాలను కూడా కేంద్రం తిరిగి పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది.
ఇలా చేయడం వలన రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు కల్పించడమేనని.. అంతేకాకుండా సెన్సార్ బోర్డు అధికారాలను కుదించినట్లేనని భావిస్తున్నారు. ఓవరాల్ గా ఈ బిల్లు స్వేచ్ఛను, క్రియేటివిటీని హరిస్తుందని సినీ తారలంతా వ్యతిరేకిస్తున్నారు.
తాజా సవరణలు చాలావరకు సినిమా రిలీజ్ సమయంలో అడ్డుపడడానికి వీలున్నవేనని మేకర్ల భావన. వ్యక్తిగత కక్షలతో, రాజకీయ దురుద్దేశంతో అడ్డుతగిలే అవకాశం ఉందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు.