బ్రిటీష్ హయాంలో క్రైస్తవం పరిఢవిల్లిన తెలుగు నేల నెల్లూరులో ఎన్నో పురాతన చర్చిలు
బ్రిటిష్ వారి రాకతో భారత్ లో క్రైస్తవ మతం ప్రవేశించింది. దక్షిణ భారత దేశంలో ఓడరేవులున్న ప్రాంతాల్లో మొదటగా చర్చిలు స్థాపించారు. ఇదే క్రమంలో ఆంధ్రాలో విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చర్చిలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో 175 ఏళ్ల క్రితమే చర్చిలకు పునాదిరాయి పడింది. 1856 సెప్టెంబర్ 2న బ్రిటీష్ వారి సహాయంతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో నెల్లూరులోని సుబేదారుపేటలో ఓ చర్చి నిర్మించారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ చర్చి కట్టడం, లోపలున్న నిర్మాణ ఆకృతి.. చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చర్చిలో ఉన్న గంట... పాతబడి, పగిలిపోయి 19వ శతాబ్దపు ఆనవాళ్లుగా మనకు కనిపిస్తుంది. అప్పట్లో గంట మోగించి ప్రజలను చర్చికి ఆహ్వానించేవారు. గత చరిత్రపు ఆనవాళ్లుగా సుబేదారుపేటలోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది.





















