Horseshoe Crab: హార్స్ షూ పీతల రక్తం లీటర్ 11 లక్షల రూపాయలా - ఎందుకంత ధరంటే!
Horseshoe Crab: హార్స్ షూ పీతలు... ఈ పేరు వింటే గుర్తుకు రావాల్సింది పీతల పులుసు, ఇంగువలు కాదు. లీటరుకు 11 లక్షల రూపాయల విలువ చేసే వాటి రక్తం. పీతల రక్తానికి ఎందుకు ఇంత ధర పలుకుతుందంటే..?
Horseshoe Crab: పీతలు.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. ఇవంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది. వీటి పులుసు, రసం, ఇగురును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ పీతల ధర మహా అయితే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు వరకు ఉంటుంది. ఇవి చాలా సహజంగా కూడా దొరుకుతుంటాయి. కానీ హార్స్ షూ అని పిలిచే పీత మాత్రం చాలా ఖరీదైనది. వీటి ధర కూడా లక్షల్లో ఉంటుంది. అలా అని వాటిని వండుకుని తినేందుకు ఉపయోగించరు. అందులో ఉండే రక్తం కోసం వీటిని కొనుగోలు చేస్తుంటారు. అదేంటి అందరూ మాంసం కోసం పీతలను కొనుగోలు చేస్తారు కానీ రక్తం కోసం ఏంటని అనుకుంటున్నారా...! వీటి కంటే వీటి రక్తానికి ఎక్కువ డిమాండ్. దాదాపు లీటర్ హార్స్ షూ ధర 11 లక్షల ఉంటుంది మరి. పీతల రక్తానికి ఇంత ధరా అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ ఇది నిజం. అయితే ఈ రక్తానికి ఎందుకంత ధరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హార్స్ షూ పీతలు డైనోసర్ల కంటే కూడా పాత కాలం జీవి. ఇవి భూమిపై దాదాపు 450 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. అయితే ఈ పీతలు ఇండియన్, అట్లాంటిక్, పస్ ఫిక్ సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో వసంత కాలం నుంచి మే, జూన్ వరకు అధిక ఆటుపోట్ల సమయంలో దర్శనం ఇస్తుంటాయి. ఈ పీతలు ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. మనుషులకు ఇచ్చే టీకాలు, సూది మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు, శరీరంలోకి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా, వాటిలో బ్యాక్టీరియా ఉందా అనేది ఈ పీతల రక్తం ద్వారా తెలుస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు 1970ల నుండి ఈ జీవి రక్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పీతల రక్తం జీవ సంబంధమైన విషాలకు చాలా సున్నితంగా ఉంటుంది. బయోమెడికల్ ఉపయోగం కోసం ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ల హార్ష్ షూ పీతలను ఉపయోగిస్తున్నారు. దీని ఒక లీటర్ ధర రూ.11 లక్షల వరకు ఉంటుంది. ఈ పీతల రక్తం నిజానికి నీలి రంగులో ఉంటుంది. వీటి రక్తంలో ఒక ప్రత్యేక రసాయనం ఉంది. ఇది బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోతుంది, వాటిని బంధిస్తుంది.
పీతల నుంచి రక్తాన్ని ఎలా సేకరిస్తారు..?
ముందుగా ఈ పీతలను సేకరించి ల్యాబ్ కు తీసుకొస్తారు. వారి బరువును కొలిచి రక్తం సరిపడా ఉన్నవాటిని మాత్రమే తీసుకుంటారు. ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్త నాళానికి సూదులు గుచ్చి రక్తం తీస్తారు. సగానికి పైగా రక్తాన్ని తీసిన తర్వాత వాటిని మళ్లీ సముద్రంలోనే వదిలిపెడతారు. అయితే ఇలా తీసిన పీతల్లో మూడో వంతు మరణిస్తుంటాయి. ఈ ప్రక్రియలో 10 నుండి 30 శాతం పీతలు చనిపోతాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. మిగిలిన ఆడ పీతలు పునరుత్పత్తిలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాలుగు జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు రకాల గుర్రపుడెక్క పీతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బయోమెడికల్ రంగంలో మరియు చేపల మేతగా ఉపయోగించడం, అలాగే కాలుష్యం కారణంగా నాలుగు జాతులు కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.