Cock Fighting: ఏపీలో కోడి పందేల సిత్రాలు - రూ.కోటి గెలిచి సత్తా చాటిన నెమలి పుంజు, సైలెంట్‌గా నిలబడి రూ.1.25 కోట్లు గెలిచిన మరో కోడిపుంజు
Andhra News: సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు అంబరాన్నంటాయి. ప.గో జిల్లాలో జరిగిన కోడి పందేలు వైరల్‌గా మారాయి. ఓ కోడిపుంజు రూ.కోటి గెలవగా.. మరో కోడిపుంజు తలపడకుండానే గెలిచింది.
Cock Fighting In Tadepalligudem: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటేనే కోడి పందేలు ఫేమస్. ఈసారి కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. ప్రత్యేక బరులు సిద్ధం చేసి నిర్వాహకులు కోడి పందేలు నిర్వహించారు. రూ.కోట్లలో చేతులు మారాయి. ముఖ్యంగా ప.గో జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem), భీమవరంల్లో (Bhimavaram) జరిగిన కోడి పందేలు వైరల్‌గా మారాయి. తాడేపల్లిగూడెంలో ఓ కోడిపుంజు ఏకంగా రూ.కోటి తెచ్చిపెట్టింది. భీమవరంలో ఓ కోడిపుంజు సైలెంట్‌గానే ఉండి రూ.1.25 కోట్లు గెలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోళ్ల పందెం వైరల్ అవుతోంది. బరిలో ఏకంగా రూ.1.25 కోట్లు పందెం కాశారు. గుడివాడ ప్రభాకర్ రావు 'నెమలి పుంజు', రత్తయ్య 'రసంగి పుంజు' బరిలోకి దిగాయి. కుక్కుట శాస్త్రం ప్రకారం ముహూర్తం చూసి మరీ నిర్వాహకులు పందేనికి ఏర్పాట్లు చేశారు. ఈ పందేనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా బెట్టింగులు కాశారు. హోరాహోరీగా సాగిన పోటీలో గుడివాడ ప్రభాకరరావు నెమలి పుంజు గెలిచి సత్తా చాటగా.. రత్తయ్య రూ.20 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
సైలెంట్‌గానే ఉండి..
అటు, భీమవరంలో ఓ కోడిపుంజు సైలెంట్‌గానే ఉండి రూ.1.25 కోట్లు గెలిచింది. బరిలో గిరి గీసి 5 కోడిపుంజులను వదలగా.. నాలుగు కోళ్లు ఒకదానితో ఒకటి ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడ్డాయి. అయితే, ఓ కోడిపుంజు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. మిగతా కోడిపుంజులు కొట్టుకుంటున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరించింది. ఈ క్రమంలో పోటీలో తలపడిన 4 పుంజులు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలగా.. సైలెంట్‌గా ఉన్న కోడిపుంజును విజేతగా ప్రకటించారు. దీంతో దాని యజమాని ఎగిరి గెంతులేశాడు. ప్రస్తుతం ఈ పందేల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3 రోజుల్లో రూ.1500 కోట్లు
కాగా, సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు భారీగా సాగాయి. కోడి పందేలకు తోడు కోతముక్క, గుండాట వంటి జూదాలతో రూ.వందల కోట్లు చేతులు మారాయి. రాత్రిపూట కూడా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పందేలు నిర్వహించారు. ఉమ్మడి ప.గో జిల్లాలోని పెదఅమిరం, డేగాపురం, సీసలి, మహాదేవపట్నం, అయిభీమవరం, కామవరపుకోట, కలిదిండి, దెందులూరు ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. మద్యం పరవళ్లు, మాంసాహార విందులు, కోళ్ల సంగ్రామం, బౌన్సర్ల బందోబస్తుతో బరులన్నీ కార్పొరేట్ స్థాయిని తలపించాయి. జిల్లా వ్యాప్తంగా రూ.700 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. యువతులు సైతం జూదక్రీడల్లో పాల్గొన్నారు.
అటు, ఉమ్మడి తూ.గో జిల్లాలో ఏకంగా 3 రోజుల్లో రూ.1500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల బరిలో 75 పందేలు ఏర్పాటు చేశారు. తూ.గో, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని ప్రతి మండలంలో సగటున 10 బరులు ఏర్పాటు చేశారు. కరప, గురజనాపల్లి, గోపాలపురం, కడియం, మండపేట, పిఠాపురం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ఆత్రేయపురం, కొత్తపేట, గోకవరం తదితర అన్ని మండలాల్లోనూ జూదక్రీడలు నిర్వహించారు.