(Source: ECI/ABP News/ABP Majha)
జనగామ వరకు MMTS ఎందుకు వేయాలంటే! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పి యాదాద్రి వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ ని జనగామ వరకు పొడిగించాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.
తెలంగాణ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పి యాదాద్రి వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ ని జనగామ వరకు పొడిగించాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. MMTS రైల్వే లైన్, లోకల్ ట్రైన్‌ను మంజూరు చేయించాలని ఆయన లేఖలో కోరారు. ఈ నెలలో పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి చెప్పి ఒప్పించాలని పోచంపల్లి విజ్ఞప్తి చేశారు. జనగామకు లోకల్ ట్రైన్ వేస్తే రైల్వేకు ఎలాంటి లాభం జరుగుతుందని లేఖలో సవివరంగా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యం, భవిష్యత్ మార్గం, లాభాలు, ప్రయోజనాలు అన్నీ లెటర్‌లో పొందుపరిచారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.
జనగామ వరకు ఎంఎంటీఎస్ ఎందుకు వేయాలి? వేస్తే లాభమేంటి?
రాజధాని నగరం హైదరాబాదుకి సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటి. జనగామతోపాటు చుట్టు 50 నుంచి 60 కి.మీ. మేర పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాదుకు వచ్చి వెళ్తుంటారు. జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతోపాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్‌కేసర్ నుంచి కూడా ప్రజలు నిత్యం ఈ రూట్ లో రైలులో రాకపోకలు సాగిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు, హైదరాబాదులో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని పొట్టపోసుకునేవారు, వ్యక్తిగత పనుల మీద, రోజువారి కూలీలు, వివిధ షాపుల్లో పనిచేసేవారు, వ్యాపారపరంగా వెళ్లేవారు ఇలా వేలాదిమంది నిత్యం ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు.
జనగామ భవిష్యత్తులో హైదరాబాదుతో మెర్జ్ అవుతుందా?
ఈ రూట్లల్లో ప్రస్తుతం నడుస్తున్న, అందుబాటులో ఉన్న అతికొద్ది ట్రైన్లల్లోనే కిక్కిరిసి ప్రయాణాలు చేస్తున్నారు. కొన్నిసార్లు రైలు కంపార్ట్ మెంట్లకు వేలాడుతూ, అత్యంత ప్రమాదకర ప్రయాణాలు సైతం చేస్తుంటారు. ట్రైన్ నుంచి జారిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఒకవైపు హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తున్నది. మరోవైపు జిల్లా కేంద్రం అయిన తర్వాత జనగామ అటు వరంగల్, కాజీపేటలకు, ఇటు సికింద్రాబాద్, హైదరాబాదుకు సమీపంగా, స్పీడుగా ఎక్స్‌పాండ్ అవతున్నది. భవిష్యత్తులో జనగామ అటు కాజీపేట, ఇటు హైదరాబాదుతో కలిసిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి జనగామకు లోక్ రైలుని విస్తరిస్తే అనేక ప్రయోజనాలున్నాయి. ఆల్రెడీ ఉన్న ట్రాక్స్ పైనే పెద్దగా ఖర్చు లేకుండానే నడపవచ్చు. తర్వాత తర్వాత ఇదే ట్రైన్‌ను కాజీపేట, వరంగల్ వరకు విస్తరించవచ్చు. ఈ అడుగు ఎంతో ముందుచూపుతో వేసినట్లు అవడమేగాక, భవిష్యత్తు తరాలకు సౌకర్యంగా మారుతుంది.
అటు రైల్వేకు లాభదాయకంగానూ, ఇటు ప్రయాణికులకు రిలీఫ్‌గా ఉంటుంది. ఈ రైల్వే రూట్లో లోకల్ ట్రైన్ వేస్తే, రోడ్లపై రద్దీ కూడా తగ్గుతుంది. ఈ రెండు దారుల్లో ప్రయాణాలు సులువు అవుతాయి. యాక్సిడెంట్లు ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి. పండుగ సమయంలో ఈ రూట్లో ట్రాఫిక్ జాంలు ప్రతీసారీ వింటున్న న్యూసే! టోల్ గేట్ దగ్గర కి.మీ మేర క్యూ లైన్ నిలిచిపోయిన అనేక సందర్భాలను మనం చూస్తున్నాం! ఆంబులెన్సులకు దారిదొరకని రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక ప్రతికూల అంశాలను గమనించి, గుర్తించి సానకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు.