Godavari At Bhadrachalam: భద్రాచలం వద్ద 67.9 అడుగులకు గోదావరి నీటిమట్టం, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్
Water Level At Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు చేరుకుంది. బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు.
Water Level At Bhadrachalam: తెలంగాణతో పాటు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు చేరుకుంది. దీంతో బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాక లోని నేషనల్ హైవే 30 పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది.
1976 నుంచి ఎనిమిదోసారి..
వారం రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వార్షాలతో వరద పెరిగిపోయింది. ఎగువ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. తాజాగా 67.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది. 1976 నుంచి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు. అదే సమయంలో మూడు దశాబ్దాల తరువాత ఇక్కడ నీటిమట్టం 70 అడుగులకు చేరువైంది.
అధికంగా 75.6 అడుగులకు నీటిమట్టం..
1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరింది. అధికారులు అప్పుడు అప్రమత్తమై తొలిసారిగా వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. చరిత్రలో ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే 70 అడుగులు దాటి గోదావరి ప్రవహించింది. తాజాగా 67.9 అడుగులకు చేరి, 70 అడుగులకు నీటిమట్టం చేరేలా కనిపిస్తుంది. 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డును అధిగమిస్తుంది. 36 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు.