Telangana Cabinet: మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లా నేతల మధ్య పోటీ, అసలు ఛాన్స్ ఉందా?
Telangana Cabinet Expansion | తెలంగాణ కేబినెట్ లో మరో ఐదారుగురికి అవకాశం దక్కనుంది. అయితే పార్టీలో కీలక నేతల చేరికలతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కానుంది.
Telangana Cabinet Telugu News: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న క్రమంలో పలువురు నేతలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయితే పదవి ఎవరికి దక్కుతుందో తెలియదు గానీ జిల్లాలవారీగా సీనియర్లు, కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళడంతో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.
కేబినెట్ లోకి మరో ఐదారుగురు!
రాష్ట్ర మంత్రి పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్లు, జూనియర్లతోపాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు మంత్రి పదవి తమకు దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఢిల్లీ పెద్దల వద్ద నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే 12 మంది మంత్రులు అన్నారు. మంత్రి వర్గంలోకి కొత్తవారిని తీసుకోవడంతో పాటు మంత్రిగా కొనసాగుతున్న వారిలో మార్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పోటీ పెరిగింది. ఆయా జిల్లాల నుంచి మంత్రులుగా ఉన్న ఇతర నేతలు మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కన్ఫామ్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరు కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న దొంతి మాధవరెడ్డి, మరొకరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి గులాబీ పార్టీలో చేరే సమయంలోనే కూతురుకు వరంగల్ ఎంపీ సీటు, కడియంకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒప్పండంతోనే పార్టీలో చేరినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. కడియం కూతురు కావ్యకు టిక్కెట్ ఇచ్చారు. ఇక కడియం శ్రీహరి కి మంత్రి పదవి రావడమే మిగిలి ఉంది. పార్టీలో చేరే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీ ప్రకారం శ్రీహరి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కడియం శ్రీహరి కూతురు, వరంగల్ ఎంపి కడియం కావ్యతో కలిసి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు.
రేసులో కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి..
జిల్లాలోని సీనియర్ నేత దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత ఆయన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గంలో టచ్ లో ఉంటారు. 2014 ఎన్నికల్లో మాధవ రెడ్డిని కాదని ఇతరులకు ఇవ్వడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు తప్ప అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్లలేదు. ముక్కుసూటి నేతగా పేరున్న మాధవరెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాధవ రెడ్డికి సన్నిహిత సంబంధాలు లేవు. ప్రచారంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గం వస్తా అని చెప్పినా నియోజకవర్గంలోకి ఏ నాయకుడు ప్రచారానికి రావద్దని తేల్చి చెప్పారు. నాలుగు రోజుల కిందట రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినా.. మాధవరెడ్డి సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే ఢిల్లీ పెద్దలతో మాధవరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నట్లు పార్టీలో వినిపిస్తోంది. ఆ కోణంలోనే తన పేరు సీల్డ్ కవర్లో వస్తుందని మాధవరెడ్డి చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కానీ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మహిళ నేతలు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఒకరు సీతక్క... మరొకరు కొండా సురేఖ. ఈ ఇద్దరిలో ఒకరు మంత్రి పదవి కోల్పోతే తప్పా.. మాధవరెడ్డి లేక కడియం శ్రీహరికి మంత్రి అవకాశాలు ఉండవు. సీతక్క హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. దీంతో సీతక్క పదవికి గండం లేదు. మరో మంత్రి కొండా సురేఖ పార్టీలో సీనియర్ నేతగా ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నారు. ఆమెను సైతం కేబినెట్ నుండి తొలగించే ఛాన్స్ లేదు. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా నేతలతో వైరుధ్యాన్ని కొనసాగిస్తున్నట్లు పార్టీలో వినిపిస్తోంది. ఒకవేళ కొండా సురేఖకు మంత్రి పదవి గండం ఉంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా.. లేక జిల్లా నుంచి మూడో నేతకు మంత్రి పదవి దక్కుతుందా అని ఆసక్తి నెలకొంది.