Warangal News: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్- పచ్చబొట్టుతో అసలు విషయం వెలుగులోకి..
Warangal News: వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్‌బాడీలు మారిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డెడ్‌బాడీ తీసుకెళ్లిన కుటుంబం పెద్ద బతికే ఉన్నట్టు తేలింది.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలు మారిన సంగతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు ఇందులో కూడా మరో ట్విస్ట్ అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఇక్కడ సిబ్బంది, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా అనే విషయం వెలుగు చూసింది. బాధితుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కుటుంబ సభ్యులు అసలు విషయం గుర్తించారు.
వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి ముంబైలో ఉండే వాడు. అక్కడే రమ పరిచయమైంది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. ఇరవై ఏళ్లుగా వాళ్లిద్దరు వేర్వేరుగానే ఉంటున్నారు. కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉంటూ భవన నిర్మాణ పనులకు వెళ్తున్నాడు.
మూడు రోజుల క్రితం తొర్రూరులోని బజాజ్ షోరూం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంకు తరలించారు. వివరాలు సేకరిస్తే అతని పేరు కుమారస్వామిగా తేలింది. ప్రమాదంలో గాయపడ్డాడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పారు.
వారు వచ్చేలోపు చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయాడు. వెంటనే ఆ డెడ్‌బాడీని మార్చురీకి తరిలించారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం పూర్తి చేసి వారికి డెడ్‌బాడీని అప్పగించారు. కుటుంబ పెద్ద చనిపోయాడన్న బాధతో వారంతా డెడ్‌బాడీని ఊరు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అప్పుడు డెడ్‌బాడీని చూసి ఆశ్చర్యపోయారు.
ఆ డెడ్‌బాడీ కుమార స్వామిది కాదని గ్రహించారు. చేతిపై పచ్చబొట్టు చూస్తే లేదు. కుమారస్వామికి శ్రీ పేరుతో పచ్చబొట్టు ఉంటుందని కుటుంబ సభ్యులుచెప్పారు. అది కూడా లేకపోవడంతో డెడ్‌బాడీ మారిపోయిందని ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి కబురు పెట్టారు.
వెంటనే ఆడెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చీకటి పడటంతో తర్వాత రోజు డెడ్‌బాడీ గురించి చూద్దామని సిబ్బంది చెప్పారు. ఇంతలో అక్కడే మరో ఘటన జరిగింది. ఐడీ వార్డులో బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో విషయాన్ని పోలీసులకు అందరికీ తెలియజేశారు. తమ ఇంటి పెద్ద చనిపోయాడని కొన్ని గంటల పాటు తీవ్ర ఆందోళనకు గురైన ఆ కుటుంబం తర్వాత ఊపిరి పీల్చుకుంది.





















