Warangal: డ్యూటీలో ఉండగానే విషపు ఇంజక్షన్ ఎక్కించుకున్న డాక్టర్, సంచలనంగా ఘటన
రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని ఓ సీనియర్ డాక్టర్ వేధించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రీతి ఫిర్యాదు మేరకు ఆ సీనియర్ డాక్టర్ ను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మందలించినట్లు తెలిసింది.
వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుఝామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను ఆమె ఎక్కించుకున్నారు. తోటి వైద్యులు ఈ విషయం గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు.
ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది తెలియదని చెప్పారు. రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని ఓ సీనియర్ డాక్టర్ వేధించినట్లు సమాచారం. ఈ ఘటనపై డాక్టర్ ప్రీతి ఫిర్యాదు మేరకు సదరు సీనియర్ డాక్టర్ ను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మందలించినట్లు తెలిసింది. అయినప్పటికీ బుధవారం డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
అయితే, సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆసుపత్రిలోకి మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు.
ఇక హైదరాబాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు.