Warangal News: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు, ఎలా సాధ్యమైంది?
Telugu News: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భరత్ అనే యువకుడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
![Warangal News: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు, ఎలా సాధ్యమైంది? Warangal man achieves five government jobs at a time by TSPSC Warangal News: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు, ఎలా సాధ్యమైంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/49410b9b7865fdec4a5aec8ab6b9820b1714398150099234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Warangal Latest News: ఒక వైపు పేదరికం, మరోవైపు విమర్శలు.. అయినా అతను ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తల్లిదండ్రులను పేదరికం నుండి విముక్తి చేయాలకున్నాడు. కలలను సాకారం చేసుకోవడానికి ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు. ఆ ఫలితమే ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులను పేదరికం నుండి విముక్తి చెయాలనుకున్న పట్టుదల సాకారమైంది. ఆ యువకుడే జనగామ జిల్లాకు చెందిన భరత్.
కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని నిరూపించాడు భాషిపాక భరత్. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈ రోజుల్లో ఐదు ఉద్యోగాలు సాధించాడు భరత్. సాధారణ వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టి కలలు సాకారం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టుదల, నిరంతర సాధనతో వాటన్నింటిని అధిగమించిన కొన్ని సందర్భాల్లో పేదరికం అత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అవేమీ లెక్కచేయకుండా విజయం సాధించాడు భరత్. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు సుజాత, రవి దంపతుల కుమారుడు భారత్. పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన భరత్.. తరువాత వరంగల్ గవర్నమెంటు పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీ.ఈ సివిల్ ఇంజనీరింగ్, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ స్ట్రక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
అంతటితో ఆగకుండా అంబేడ్కర్ ఓపెన్ యూనవర్సిటీ నుండి బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కూడా పూర్తి చేశాడు. తాము పడుతున్న కష్టం నువ్వు పడకూడదని బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు మాటలను ఛాలెంజ్ తీసుకున్నాడు భారత్. వారి కలను సాకారం చేయాలని హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు ఏడేళ్లు సన్నద్ధం అయ్యాడు. కొన్నిపోటీ పరీక్షలలో ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకున్న సందర్భాలు లేక పోలేదు. ఉద్యోగాలు వచ్చినట్టే వచ్చి చేజరిపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా భరత్ తన లక్ష్యాన్ని వదలలేదు. విమర్శలను ఆశీర్వాదంగా తీసుకున్న భరత్ ప్రిపరేషను మరింత ప్రణాళిక బద్ధంగా రూపొందించుకున్నారు. ఇంకేముంది ఒకటి కాదు రెండు కాదు ఐదు ఉద్యోగాలు సాధించి విమర్శించిన నోటితోనే శభాష్ అనిపించుకున్నాడు.
ఇటీవల ప్రకటించిన టీఎస్పీఎస్సీ జీఆర్ఎల్ (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకారం ఐదు ఉద్యోగాలు వస్తున్నాయని అని నిర్ధారించుకున్న భరత్.. ప్రస్తుతం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. 2023 డిసెంబర్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో చేరిన భరత్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడిన నోటిఫికేషన్లకు భరత్ దరఖాస్తు చేసుకున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు పోటీ పరీక్షలకు హాజరవుతూ వచ్చారు. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడడంతో నాలుగు ఉద్యోగాలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, గ్రూప్ -4 ఉద్యోగాలు వస్తాయని భరత్ తెలిపారు.
తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఉద్యోగాలు సాధించానని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ఎదుటి వారితో పోల్చవద్దని భరత్ అన్నారు. గంటల తరబడి చదవకుండా స్మార్ట్ గా చదివానని భరత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను సొంతంగా ప్రిపేర్ అయ్యానని కోచింగ్ లకు వెళ్ళలేదని అన్నారు. బుక్స్ కోసం, ఫీజుల కోసం తల్లిదండ్రులతోపాటు స్నేహితులు ఆర్థిక సహాయం చేశారని భరత్ చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో ఐదు ఉద్యోగాలు సాధించారు భరత్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)