Minister Errabelli: మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో టెన్షన్ టెన్షన్ !
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్యెల్యేల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది సిట్టింగ్ ఎమ్యెల్యేలకు టిక్కెట్ గండం ఉన్నట్లు సమాచారం.
TS Minister Errabelli Dayakar Rao Prediction: వరంగల్ : మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఓరుగల్లు జిల్లాలో పెను దుమారం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని నరసింహుల పేట మండలం కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో వైరల్‌గా మారుతున్నాయి. ఇటు అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్యెల్యేల్లో మంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం సూచన మేరకే దయాకరరావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్యెల్యేల వ్యవహారంపై ఇప్పటికే అధిష్టానం సర్వే చేసినట్లు సమాచారం. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది సిట్టింగ్ ఎమ్యెల్యేలకు టిక్కెట్ గండం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఎమ్యెల్యేలు ఎవరు అనేది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్యెల్యేలపై ప్రత్యేక సర్వే?
ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ సీక్రెట్ సర్వే లో కొంతమంది ఎమ్యెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు తేలినట్లు సమాచారం. అయితే తాజాగా మంత్రి చేసిన కామెంట్స్ తో అది నిజమే అని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. వరంగల్ ట్రై సిటీతో పాటు సీటీ చుట్టూ ప్రక్కల ఉన్న ఎమ్యెల్యేలు ఆ లిస్టులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ఎమ్యెల్యేలు తమకు కూడా సీటు గండం ఉందా అనే టెన్షన్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం బహిరంగ సభకు ఒక్కరోజు ముందు మంత్రి ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం టికెట్ గండం ఉన్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరా అని చర్చ మొదలైంది.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఏమన్నారంటే..
వచ్చే ఎన్నికల్లో పార్టీలు గెలులుచుకనే సీట్లపై మంత్రి ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఎవరితో పోటీ ఉంటుందో వివరించారు. తాను చేసిన సర్వేల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయంటూ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకతత ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. 17 నుంచి 20 మంది సిట్టింగ్‌లను మారిస్తే మాత్రం బీఆర్‌ఎస్ వందకు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు.
తన సర్వే ఎప్పుడూ తప్పుకాలేదన్న మంత్రి.. ఈసారి కూడా నిజం అవుతందని కామెంట్స్ చేశారు. తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ 80 నుంచి 90 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే ఆ సీట్లు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నప్పటినీ... స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటు వేయబోరని అన్నారు. వారి స్థానంలో వేరేవాళ్లకు స్థానం కల్పిస్తే మాత్రం మరో ఇరవై స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజల్లో బలం లేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ 20 నుంచి 25 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, అయితే బీఆర్ఎస్ లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లు వేరే నేతలకు ఇస్తే గులాబీ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. మరికొన్ని జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.