Telangana Politics: బీజేపీకి మరో షాక్ - టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ ఎంపీ రాపోలు
ఇటీవల కొందరు నేతలు బీజేపీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కాషాయం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల కొందరు నేతలు బీజేపీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కాషాయం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో మాజీ ఎంపీ రాపోలు భేటీ అయ్యారు. చేనేత రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన రాపోలు ఆనంద భాస్కర్.. కేంద్రం విధానాలతో బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా చేనేతపై 5% జీఎస్టీని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విధించడాన్నిరాపోలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం ద్వారా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేనేతరంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను మాజీ ఎంపీ అభినందించారు. చేనేత సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోతున్నానని.. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ తో భేటీలో రాపోలు తెలిపారు. భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని రాపోలు స్వాగతించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
బీజేపీకి వరుస షాక్‌లు, టీఆర్ఎస్‌లో నేతల చేరికలు
బీసీ నేతలు ఒక్కొక్కరు బీజేపీని వీడుతున్నారు. ఇటీవల శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, పల్లె రవికుమార్ లాంటి బీసీ నేతలు ఇప్పటికే బీజేపీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ చేరనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు చెప్పింది జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మునుగోడులో బీజేపీకి విజయం అందించాలని స్టీరింగ్ కమిటీలో పార్టీ నియమించిన దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లాంటి నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరిపోయారు. రాపోలు సైతం బీజేపీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
పద్మశాలీ సంఘం నాయకుడు అయిన రాపోలు ఆనంద భాస్కర్ జర్నలిస్టుగా సేవలు అందించారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఆ మరుసటి ఏడాది బీజేపీలో చేరిన రాపోలు.. ఇటీవల కేంద్రం చేనేతకు జీఎస్టీ విధించడంపై అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలో చేనేత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.